ఐసీఐసీఐకు మరో ‘నీరవ్‌’ కుచ్చుటోపీ

17 Oct, 2018 15:22 IST|Sakshi

సాక్షి,ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్‌కు ఒక డైమండ్‌ కంపెనీ టోపీ పెట్టింది.  దీంతో ఇప్పటికే వీడియోకాన్‌ రుణాల వివాదంతో సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకు మరోసారి చిక్కుల్లో పడింది. ముంబైకి చెందిన డైమండ్‌ కంపెనీ కోట్లాది రూపాయల రుణాన్ని చెల్లించకుండా డీఫాల్ట్‌ అయింది. దీంతో అక్టోబర్‌ 4వతేదీన ఆ కంపెనీ పై ఐసీఐసీఐ బ్యాంకు కేసు పెట్టింది.

ముంబైకి చెందిన ష్రూంజ్ అండ్ కంపెనీ సుమారు రూ.88.25 కోట్లు(12 మిలియన్ డాలర్లు) చెల్లించాల్సి ఉందని బ్యాంకు  ఆరోపించింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ సదరు డైమండ్ కంపెనీ సహా పదకొండు మంది ఎగ్జిక్యూటివ్స్‌పై అమెరికా కోర్టులో కేసులు నమోదు చేసింది. న్యూయర్క్‌ ఐసీఐసీఐ బ్రాంచ్ ఆర్ఐసీఓ ఉల్లంఘన చట్టం కింద సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. తీసుకున్న డబ్బు మొత్తాన్ని యూఎస్, యూఏఈ ల్లోని షెల్ కంపెనీల్లోకి మళ్లించారని బ్యాంకు తెలిపింది. తద్వారా ఆర్ఐసీఓ చట్టాన్ని పలుమార్లు ఉల్లంఘించారని బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ష్రూంజ్ & కో. ప్రతినిధి తెలిపారు.
 

కాగా 226 కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిందని ఆరోపిస్తూ ష్రూంజ్ అండ్ కంపెనీపై బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది ఆగస్టులో ముంబైలోని ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బీవోఐ నేతృత‍్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియానికి 1113కోట్ల రూపాయల మొత్తం బకాయి పడిందనీ, దీంతో డైమండ్‌ సంస్థపై దివాలా చర్యలు తీసుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు