జేపీ అసోసియేట్స్‌కు బ్యాంకుల ఊరట

28 Jun, 2017 01:18 IST|Sakshi
జేపీ అసోసియేట్స్‌కు బ్యాంకుల ఊరట

రుణ పునరుద్ధరణకు ఓకే!
30 వేలకోట్ల రుణం 3 భాగాలు
వ్యాపారాల విక్రయంతో చెల్లింపులు


న్యూఢిల్లీ: జై ప్రకాష్‌ అసోసియేట్స్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ రుణాలను పునరుద్ధరించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం అంగీకరించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు విషయాన్ని వెల్లడించాయి. రూ.30,000 కోట్ల రుణాన్ని 3 భాగాలుగా వర్గీకరించడం ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగం. తన సిమెంట్‌ వ్యాపారంలో ముఖ్యమైన భాగాన్ని అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు విక్రయించడం ద్వారా జేపీ అసోసియేట్స్‌ బ్యాలెన్స్‌ షీట్‌ నుంచి రూ.10,000 కోట్ల మేర రుణ భాగం మొదట తొలగిపోనుంది.

ఇక కంపెనీ ఆధ్వర్యంలోని రూ.13,000 కోట్ల విలువైన భూములను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రుణదాతలు తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ఈ భూములను విక్రయించడం ద్వారా దీర్ఘకాలంలో రెండో రుణ భాగాన్ని తీర్చాల్సి ఉంటుంది. మిగిలిన మరో రుణ భాగం కంపెనీ బ్యాలన్స్‌ షీట్లలోనే ఉంటుంది. కంపెనీ నిర్వహణలో ఇంకా కొంత మేర సిమెంట్‌ వ్యాపారం, ఈపీసీ విభాగం, 5 లగ్జరీ హోటళ్లు, విద్యుత్‌ ప్లాంట్లు, ఒక హాస్పిటల్, స్పోర్ట్స్‌ వ్యాపారం ఉంటాయి. వీటిపై ఆధారపడి కంపెనీ మూడో రుణ భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రణాళికపై జేపీ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు