ఐసీఐసీఐకి కొత్త చైర్మన్‌

30 Jun, 2018 00:27 IST|Sakshi

రిటైర్డ్‌ ఐఏఎస్‌ గిరీష్‌ చంద్ర చతుర్వేది నియామకం

జూలై 1 నుంచి బాధ్యతల్లోకి చతుర్వేది

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ గిరీష్‌ చంద్ర చతుర్వేది పేరును బోర్డు ప్రతిపాదించింది. ప్రస్తుత చైర్మన్‌ ఎంకే శర్మ పదవీకాలం ఈ నెల 30తో ముగిసిపోతోంది. దీంతో జూలై 1 నుంచి మూడేళ్ల కాలానికి చతుర్వేదిని చైర్మన్‌గా ఎంపిక చేసినట్టు బోర్డు ప్రకటించింది. అయితే దీనికి వాటాదారులు కూడా ఆమోదం తెలపాల్సి ఉందని బోర్డు వెల్లడించింది. కొత్త బాధ్యతల స్వీకరణకు వేచి చూస్తున్నట్టు గిరీష్‌ చంద్ర చతుర్వేది తెలిపారు.

తన ప్రాధమ్యాలు ఏంటన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. ఇటీవలి పరిణామాల నుంచి బ్యాంకు బయటపడుతుందన్న ఆశాభాశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘దీన్నొక చిక్కుముడిగా చెప్పలేను. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. అది మేం చేయగలమని నమ్మకంగా చెప్పగలను’’ అని చతుర్వేది అన్నారు.

వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీ వెనుక బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్‌ కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణల నేపథ్యంలో పలు దర్యాప్తులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కీలక సమయంలో అనుభవజ్ఞుడైన మాజీ ఐఏఎస్‌ను చైర్మన్‌గా ఎంపిక చేయడం వ్యూహాత్మక చర్యగానే కనిపిస్తోంది.

ఆర్థిక వ్యవహారాల్లో అనుభవజ్ఞుడు
65 సంవత్సరాల గిరీష్‌ చంద్ర చతుర్వేది... 1977 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్‌ కేడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. 2013 జనవరిలో కేంద్ర పెట్రోలియం శాఖ సెక్రటరీగా ఆయన పదవీ విరమణ చేశారు. కేంద్ర ఆర్థిక సేవల విభాగంలో బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఎంఎస్‌సీ ఫిజిక్స్, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో సోషల్‌ పాలసీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్థిక చరిత్రలో డాక్టరేట్‌ కోర్సులు చేశారు. ఐడీబీఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా బోర్డుల్లో ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

మరిన్ని వార్తలు