ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.2,025 కోట్లు

4 May, 2017 00:39 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.2,025 కోట్లు

భారీగా పెరిగిన నికర ఎన్‌పీఏలు
ప్రతి పది షేర్లకు ఒక బోనస్‌ షేర్‌
ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌


న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్‌) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో  రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.  నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు  (188 శాతం)  పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది.

 వడ్డీయేతర(ఇతర) ఆదాయం 41 శాతం క్షీణించి రూ.3,017 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభం 28 శాతం క్షీణించి రూ.5,112 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇతర ఆదాయం భారీగా వచ్చిందని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వాటా విక్రయం వల్ల ఆ క్వార్టర్‌లో భారీగా ఇతర ఆదాయం సమకూరిందని వివరించింది. కాగా, క్యూ4లో కన్సాలిటేడెడ్‌ నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.2,083 కోట్లకు చేరిందని  బ్యాంక్‌ పేర్కొంది.

ఎన్‌ఐఐ 10% అప్‌..
నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 10% వృద్ధితో రూ.5,962 కోట్లకు, రుణ వృద్ధి 7% పెరుగుదలతో రూ.4.64 లక్షల కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.12% నుంచి 3.57 శాతానికి పెరిగింది. దేశీయ రుణాలు 14%, మొత్తం రుణాల్లో 52%గా ఉన్న రిటైల్‌ రుణాలు 19% చొప్పున వృద్ది సాధించాయి. డిపాజిట్లు 16 శాతం వృద్ధితో రూ.4.9 లక్షల కోట్లకు పెరిగాయి. ఫీజు ఆదాయం 11% వృద్ధితో రూ.2,446 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ పేర్కొంది.

తగ్గిన కేటాయింపులు...
స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏ) 12 శాతం వృద్ధితో రూ.42,552 కోట్లకు, నికర ఎన్‌పీఏలు 26 శాతం వృద్ధితో రూ.25,451 కోట్లకు పెరిగాయి.  అంటే మొత్తం రుణాల్లో స్థూల స్థూల ఎన్‌పీఏలు 5.21 శాతం నుంచి 7.89 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2.67% నుంచి 4.89%కి ఎగబాకాయి.

సిమెంట్‌ రంగానికి చెందిన ఒక కంపెనీ రూ.5,378 కోట్ల రుణం  కారణంగా మొండి బకాయిలు బాగా పెరిగాయని సమాచారం. ఎన్‌పీఏలకు కేటాయింపులు క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన 7% వృద్ధితో రూ.2,898 కోట్లకు పెరిగాయని, అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 13%ట క్షీణించాయని బ్యాంక్‌ పేర్కొంది.  అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో కేటాయింపులు రూ.3,600 కోట్లుగా ఉన్నాయని వివరించింది.

పూర్తి ఏడాది ఇలా...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.9,726 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.9,801 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ వివరించింది. ఆదాయం రూ. 68,062 కోట్ల నుంచి రూ.73,661 కోట్లకు ఎగసిందని పేర్కొంది.

1:10 బోనస్‌
రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్‌ షేర్‌(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 1.1 శాతం తగ్గి రూ.273 వద్ద ముగిసింది.

మొండి బకాయిలు పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్‌  తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్‌ 3 శాతానికి పైగానే సాధించగలమని     అంచనా వేస్తున్నాం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు చెప్పుకోదగిన స్థాయిలో తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గతంలోని కొన్ని మొండిబకాయిలు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
–చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్‌

మరిన్ని వార్తలు