ఐసీఐసీఐ బ్యాంకుపై  మొండి బకాయిల బండ 

28 Jul, 2018 00:52 IST|Sakshi

జూన్‌ క్వార్టర్లో    రూ.120 కోట్ల నష్టాలు 

దశాబ్ద కాలంలో తొలిసారి నష్టం  

ఎన్‌పీఏలకు రెట్టింపైన  కేటాయింపులు 

స్థూల నిరర్థక ఆస్తులు   8.81 శాతానికి పెరుగుదల 

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) కారణంగా జూన్‌ త్రైమాసికంలో రూ.120 కోట్ల స్టాండలోన్‌ నష్టాలను ప్రకటించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఐసీఐసీఐ బ్యాంకు నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.2,049 కోట్ల లాభాలను ఆర్జించడం గమనార్హం. ఇక ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.16,847 కోట్ల నుంచి రూ.18,574 కోట్లకు పెరిగింది.  

నికర ఎన్‌పీఏలు తగ్గుదల 
బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడకపోగా, మరి కాస్త క్షీణించింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు రూ.8.81 శాతానికి (రూ.53,464 కోట్లు) పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇవి 7.99 శాతంగా ఉన్నాయి. కొత్తగా రూ.4,036 కోట్ల ఎన్‌పీఏలు తోడవ్వగా, అదే సమయంలో వసూళ్లు రూ.2,036 కోట్లు కావడం గమనార్హం. ఎన్‌పీఏలు, కంటింజెన్సీల (చేయాల్సిన చెల్లింపులు) కోసం బ్యాంకు రూ.5,971 కోట్లను పక్కన పెట్టింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ కేటాయింపులు రూ.2,608 కోట్లుగానే ఉన్నాయి. అంటే 129 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్‌పీఏల రేషియో మాత్రం తగ్గింది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 4.77 శాతంగా ఉండగా, జూన్‌ త్రైమాసికంలో అది 4.19 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 4.86 శాతంగా ఉండడం గమనార్హం. 

వడ్డీ ఆదాయం  
జూన్‌ క్వార్టర్లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ.6,102 కోట్లకు వృద్ది చెందింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.5,590 కోట్లుగానే ఉంది. అయినప్పటికీ మొత్తం మీద నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 3.23 శాతం నుంచి 3.19 శాతానికి క్షీణించింది.  

కన్సాలిడేటెడ్‌ లాభం రూ.5 కోట్లు 
కన్సాలిడేటెడ్‌గా చూసినా బ్యాంకు కేవలం రూ.4.93 కోట్ల లాభాన్నే గడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కన్సాలిడేటెడ్‌ లాభం రూ.2,604 కోట్లు. ఆదాయం మాత్రం రూ.26,517 కోట్ల నుంచి రూ.29174 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచర్‌పై వ్యక్తిగత లబ్ధి ఆరోపణలు రావడంతో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.1,110 కోట్ల ఆదాయం రావడంతో నష్టాలు తగ్గినట్టు బ్యాంకు తెలిపింది. 

ఇక మీదట తగ్గుతాయి: బక్షి 
బ్యాంకు ఎన్‌పీఏలు రానున్న కాలంలో తగ్గుతాయని, ఎన్‌పీఏ సైకిల్‌ చివరి దశలో ఉన్నామని ఐసీఐసీఐ నూతన బాస్‌ సందీప్‌బక్షి తెలిపారు.    

>
మరిన్ని వార్తలు