జీతాల పెంపు యోచనలో ఐసీఐసీఐ బ్యాంక్‌

8 Jul, 2020 10:34 IST|Sakshi

జూలై నుంచి అమల్లోకి..?

కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్‌రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ తన సిబ్బంది జీతాలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు 80వేల మందికి పైగా ఉద్యోగుల మూలవేతనంపై 8శాతం పెంచనుంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలోనూ బ్యాంకుకు వీరు అందించిన సేవలకు ప్రోత్సాహకంగా వేతనాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంచుతున్న 8శాతం వేతనం ఈజూలై నుంచి అమల్లోకి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించే ఎం1, అంతకంటే తక్కువ గ్రేడ్‌ ఉద్యోగులకు ఈ వేతనాల పెంపు ఉంటుందని తెలుస్తుంది. అయితే వేతనాల పెంపు అంశంపై బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

కోవిడ్‌-19 దెబ్బకు అనేక సంస్థలు వ్యయా నియంత్రణలో భాగంగా సిబ్బందిని తొలగించడం, వేతనాల కోత విధిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారి వేతనాలు పెంచడం అభినందనీయమని కార్పోరేట్‌ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు