బ్యాంకు షేర్లు బేజార్..

29 Jan, 2016 23:59 IST|Sakshi
బ్యాంకు షేర్లు బేజార్..

ఏడాదిలో 50-66 శాతానికి పైగా నష్టం
20 పీఎస్‌యూ బ్యాంకుల ఉమ్మడి  విలువ హెచ్‌డీఎఫ్‌సీ కన్నా తక్కువే
వివిధ ఒత్తిళ్లతో భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కార్పొరేట్లు
షేర్ల పతనానికి ఎన్‌పీఏలే ప్రధాన కారణమంటున్న విశ్లేషకులు
అవసరమున్నా... నిధులు సమీకరించలేని దుస్థితి

మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిది. ప్రభుత్వ బ్యాంకులు అంత బలంగా ఉండటం వల్లే ఇప్పటికీ కింది స్థాయి వరకూ కొంతలో కొంతైనా రుణాలందుతున్నాయి. కాకపోతే ఆ బ్యాంకులకిపుడు నిరర్థక ఆస్తుల సెగ తీవ్రంగానే తగులుతోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రభావాలతో బడా బాబులకు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవటంతో అవి కొండలా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలు తెస్తుండటంతో... రాబోయే రోజుల్లో ఎన్‌పీఏలు మరింత పెరిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఫలితం... స్టాక్ మార్కెట్లో వీటిపై ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతూ... నానాటికీ పాతాళానికి పడిపోతున్నాయి.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :రెండేళ్ల కిందట మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్న అంచనాలు... ఆ అంచనాలకు తగ్గట్టే భారీ మెజారిటీతో మోదీ అధికారంలోకి రావటం... ఇవన్నీ గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను పరుగులు పెట్టించాయి. ప్రభుత్వం మారినా బ్యాంకుల్లో పరిస్థితి మారకపోవటంతో ఇన్వెస్టర్లు వాస్తవంలోకి వచ్చారు.

దీంతో దాదాపు అన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లూ ఇపుడు నాలుగైదేళ్ల కనిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో నిఫ్టీ 17 శాతం నష్టపోతే... పీఎస్‌యూ బ్యాంక్ సూచీ మాత్రం 47 శాతం నష్టపోయింది. వీటిలో పది బ్యాంకులైతే 50 నుంచి 66 శాతం వరకూ నష్టపోయాయి. ఒక్క జనవరి నెలలోనే పీఎస్‌యూ బ్యాంకులు 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ప్రస్తుతం చాలా పీఎస్‌యూ బ్యాంకులు వాటి పుస్తక విలువ(బుక్ వేల్యూ) కంటే మూడు నుంచి నాలుగు రెట్ల కనిష్ట స్థాయిలో కదులుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ మినహా ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నిటి మార్కెట్ విలువ... ప్రైవేటు రంగంలోని ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ కంటే తక్కువ ఉందంటే ఈ షేర్లు ఏ విధంగా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చాలా పీఎస్‌యూ బ్యాంకుల షేర్ల ధరలు ఇపుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... ఇంకా కిందకు పడే అవకాశాలున్నాయన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు.

 మొండి బకాయిలే అసలు సమస్య..
మొండి బకాయిల సమస్య తీరిపోయినట్లేనని బ్యాంకులు ఐదేళ్ల నుంచి ప్రకటిస్తున్నా.,. వాస్తవం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6 శాతం దాటిపోయింది. ఇప్పుడు ఆర్‌బీఐ పీఎస్‌యూ బ్యాంకుల ప్రక్షాళనకు చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం ఎన్‌పీఏలు మరింత పెరిగేటట్లు చేస్తోంది. 2017వ సంవత్సరం మార్చి నాటికల్లా బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయాలని, తద్వారా మొండి బకాయిల సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.

అంతేకాకుండా 150 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అన్ని రకాల రుణాలకూ పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ కేటాయింపులు చేయాలని కూడా చెప్పింది. దీంతో ఇంతకాలం వడ్డీలు కడుతూ... పునర్ వ్యవస్థీకరణ పేరుతో స్టాండర్డ్ అసెట్స్‌గా చూపిస్తున్న వాటిని కూడా ఇప్పుడు ఎన్‌పీఏలుగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక కంపెనీ తీసుకున్న రుణం ఎన్‌పీఏగా మారకుండా ఉండాలంటే కనీసం వడ్డీనైనా చెల్లించాలి. కొన్ని కంపెనీలు ఆ వడ్డీ కూడా చెల్లించకపోవటంతో... అందుకోసం బ్యాంకులు కొత్త రుణాలిచ్చేవి. ఆర్‌బీఐ ఆదేశాలతో ఇక ఇలా చేయటం కుదరదు.

దీంతో కలుగులో దాక్కున్న ఎన్‌పీఏలు కూడా బయటకు వస్తున్నాయని కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల చెప్పారు. ఈ ఏఎన్‌పీఏలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల ఈసారి చాలా బ్యాంకులు నష్టాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఈ చర్యలన్నిటి వల్లా పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు 8-9 శాతానికి చేరవచ్చనే అంచనాలున్నాయి.

బ్యాంకులపై పెరుగుతున్న ఒత్తిడి
అంతర్జాతీయంగా వృద్ధిరేటు మందగించటం, రాజకీయ ఒత్తిళ్లతో అడ్డగోలుగా కార్పొరేట్ సంస్థలకు రుణాలివ్వడం వంటి కారణాల వల్ల పీఎస్‌యూ బ్యాంకులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్‌ఫ్రా, విద్యుత్ పంపిణీ, మెటల్ రంగాలకు పీఎస్‌యూ బ్యాంకులు అధికంగా రుణాలిచ్చాయి.

దీనికి భిన్నంగా ప్రైవేటు బ్యాంకులు రిటైల్ రుణాలను ఎక్కువగా నమ్ముకోవడం వలే ్ల ప్రైవేటు బ్యాంక్ షేర్లు అంతగా పతనం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌పీఏలు, బాసెల్ 3 నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకునేంత వరకు పీఎస్‌యూ బ్యాంకులపై ఒత్తిడి ఇదే విధంగా ఉంటుందని జెన్‌మనీ జేఎండీ కె.సతీష్ చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల్లో రిస్క్ చాలా ఉంది కాబట్టి వీటికి దూరంగానే ఉండమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

నిధుల సేకరణ కష్టమే..
పెరుగుతున్న ఎన్‌పీఏలను సర్దుబాటు చేయటానికి, బాసెల్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ నిధులు అవసరమవుతాయి. వచ్చే నాలుగేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులకు రూ.1.72 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరమవుతుందని అంచనా. ఇందులో రూ.70,000 కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. ఈ ఏడాది రూ.25,000 కోట్లు సమకూరుస్తామని కేంద్రం చెప్పగా ఇప్పటి వరకు 13 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.20,088 కోట్ల మూలధనాన్ని కేటాయించింది.

వివిధ మార్గాల ద్వారా బ్యాంకులు ఇంకా రూ.1.1 లక్షల కోట్లు సమకూర్చుకోవాలి. కానీ ఇప్పటికే షేర్ల ధరలు బాగా పడిపోవడం, పుస్తక విలువ కంటే చాలా తక్కువ రేట్లలో ట్రేడ్ అవుతుండటంతో బ్యాంకులకు నిధుల సేకరణ కష్టంగా మారింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గించుకొని, నికర వడ్డీ లాభదాయకత పెంచుకుంటేనే ఈ రంగ షేర్లు పుంజుకుంటాయని జగన్నాథం చెప్పారు.

మరిన్ని వార్తలు