చందా కొచర్‌కు షాక్‌.. ఐసీఐసీఐ ఖండన!

1 Jun, 2018 13:02 IST|Sakshi

వీడియోకాన్‌ కుంభకోణంలో తమ సీఈవో చందాకొచర్‌కు షాక్‌ ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్‌ కుంభకోణంలో స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు చందా కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా ఐసీఐసీఐ బోర్డు ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను తోసిపుచ్చిన ఐసీఐసీఐ.. చందా కొచర్‌ ప్రస్తుతం వార్షిక సెలవులో ఉన్నారని, ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారమే ఆమె సెలవు తీసుకున్నారని వెల్లడించింది.

వీడియోకాన్‌ సంస్థకు రుణాల విషయంలో చందా కొచర్‌పై క్విడ్‌ ప్రో కో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌కు రుణాలు అందించినందుకు ప్రతిగా.. ఆమె భర్త సంస్థలోకి వీడియోకాన్‌ నుంచి పెద్ద ఎత్తున నిధులు తరలినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌కు చెందిన కంపెనీలో వీడియోకాన్ గ్రూప్‌ అధిపతి వేణుగోపాల్‌ ధూత్ 325 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు ఆమె నేతృత్వంలోని ఐసీఐసీఐ కన్సార్షియం వీడియోకాన్‌కు రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా గుర్తించడంతో ఈ వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ స్కాం విషయంలో కొచర్‌ ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై పూర్తి నమ్మకం ఉందని గతంలో ఐసీఐసీఐ బాసటగా నిలిచింది. అయితే, ఈ నెల 29న జరిగిన ఐసీఐసీఐ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో కొచర్‌ను సెలవు మీద పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాకుండా ఆమె స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు అన్ని తప్పేనని, తాము అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఐసీఐసీఐ బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు