మరో భారీ కుంభకోణం : చిక్కుల్లో కొచ్చర్‌

29 Mar, 2018 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ : పీఎన్‌బీ కుంభకోణం అనంతరం బ్యాంకింగ్‌ కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం బయటపడింది. వీడియోకాన్‌ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌ సాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2012లో ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్‌కు ఈ రుణం ఇచ్చినట్టు తెలిసింది. 

వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్ ధూత్‌లో పాటు చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, చందాకొచ్చర్‌కు చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు 2008లో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌కు రూ.3250 కోట్ల రుణం అందిన వెంటనే ఆ కంపెనీలో ఉన్న వేణుగోపాల్‌ తన వాటాను దీపక్‌ కొచ్చర్‌కు ట్రాన్సఫర్‌ చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీచేసిన ఆ రుణంలో దాదాపు 86 శాతం అంటే రూ.2810 కోట్లు ఈ గ్రూప్‌ చెల్లించలేకపోయింది. దీంతో 2017లో ఆ రుణమంతటిన్నీ స్థూల నిరర్థక ఆస్తిగా ప్రకటించారు. ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు మాత్రమే కాక, మొత్తం బ్యాంకులన్నీ కలిపి వీడియోకాన్‌ సంస్థకు మొత్తం రూ.36వేల కోట్ల రుణమిచ్చినట్టు తెలిసింది. నిబంధనలు పాటించకుండా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు కొచ్చర్‌ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబీకులు లబ్ది పొందారని ప్రస్తుతం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు వివరణ ఇచ్చింది.  

2012 ఏప్రిల్‌లో వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కన్సార్షియంలో తమది లీడ్ బ్యాంక్ కూడా కాదని పేర్కొంది. కన్సార్షియంలో భాగంగానే సుమారు రూ.3,250 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది కన్సార్షియం ఇచ్చిన మొత్తం రుణంలో 10 శాతం కన్నా తక్కువేనని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. రుణ నిబంధనలను చందాకొచ్చర్‌ ఉల్లంఘించలేదని పేర్కొంది. వీడియోకాన్‌కు రుణమివ్వాలనే నిర్ణయం చందాకొచ్చర్‌ ఒక్కరిదే కాదని, బ్యాంకు క్రెడిట్‌ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆమె కమిటీ చైర్‌పర్సన్‌ కూడా కాదని ప్రకటించింది. ఆరోపణల్లో పేర్కొంటున్నట్లుగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చినందుకు చందా కొచ్చ‌ర్ ఎటువంటి లబ్ధి పొందలేదని.. ఈ వ్యవహారంలో క్విడ్‌ ప్రోకో గానీ ఆశ్రిత పక్షపాతం గానీ స్వార్ధ ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు