15 నుంచి ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఐపీఓ

13 Sep, 2017 01:15 IST|Sakshi
15 నుంచి ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఐపీఓ

► నాన్‌లైఫ్‌ ప్రైవేట్‌ బీమా సంస్థల్లో మేమే టాప్‌
► సంస్థ సీఎఫ్‌ఓ గోపాల్‌ బాలచంద్రన్‌ వెల్లడి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విదేశీ సంస్థలు భారతీయ బీమా కంపెనీల్లో వాటాలను 10 శాతానికే పరిమితం చేసుకోవాలన్న ఐఆర్‌డీఎ నిబంధనల్ని అమలు పరచటంలో భాగంగా ఐపీఓకు వస్తున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ గోపాల్‌ బాలచంద్రన్‌ చెప్పారు. దేశీయంగా అతిపెద్ద నాన్‌లైఫ్‌ ప్రైవేట్‌ బీమా కంపెనీ తమదేనంటూ ఈ రంగంలో మొదట ఐపీఓకి వస్తున్నది కూడా తామేనని తెలియజేశారు. ఐపీఓ వివరాలను వెల్లడించటానికి మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘తాజా ఆఫర్‌లో కంపెనీలోని విదేశీ భాగస్వామి ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్స్‌ 5.45 కోట్ల ఈక్విటీ షేర్లను, దేశీయ భాగస్వామి ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.17 కోట్ల షేర్లను విక్రయిస్తాయి.

ఐపీఓలో ఫెయిర్‌ఫాక్స్‌ వాటాలో 12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటాలో 7 శాతం అమ్మకానికి పెడుతున్నాం. ఐపీఓ అనంతరం కంపెనీలో ఫెయిర్‌ఫాక్స్‌ వాటా 9.91 శాతానికి, ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటా 56 శాతానికి తగ్గుతుంది’’ అని వివరించారు. ఐపీఓలో 50 శాతం క్యుఐబీలకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైలర్లకు (ఇందులోనే 5 శాతం ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఉన్నవారికి) రిజర్వ్‌ చేశామన్నారు. ఐపీఓ ధర శ్రేణిని రూ.651– 661గా నిర్ణయించామన్నారు. ఐపీఓ ఈనెల 15న ప్రారంభం అయి 19న ముగుస్తుంది.

మోటార్‌ బీమాలే అధికం
దేశీ నాన్‌లైఫ్‌ బీమా విభాగంలో సింహభాగం మోటార్‌ బీమాదేనని గోపాల్‌ చెప్పారు. ‘‘వాహన బీమాది 40 శాతం వాటా. 27 శాతం హెల్త్‌ది. ఇప్పుడిప్పుడే పంటల బీమా వాటా పెరుగుతోంది. మొత్తం నాన్‌లైఫ్‌ బీమా పరిశ్రమలో మా వాటా 8 శాతం. ప్రైవేట్‌ విభాగంలో ఇది 18 శాతం’’ అని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ అండర్‌రైటింగ్స్‌ చీఫ్‌ సంజయ్‌ దత్తా పాల్గొన్నారు.

ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో 20 నుంచి
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీవో సెప్టెంబర్‌ 20న ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 22న ముగియనున్న ఈ ఐపీవోలో భాగంగా సంస్థ రూ.8,400 కోట్లను సమీకరించనుంది. కాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తర్వాత మార్కెట్‌లో లిస్ట్‌ కాబోతోన్న రెండో జీవిత బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌. మార్కెట్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌ రూ.685–రూ.700 శ్రేణిలో ఉండొచ్చని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు