ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు

29 Jul, 2019 11:38 IST|Sakshi

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ జూన్  త్రైమాసికంలో స్టాండెలోన్  ప్రాతిపదికన రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్‌ లాభాలు రూ.1,350 కోట్లు–రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 18,574 కోట్ల నుంచి రూ. 21,405 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్ ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి.  ఎన్‌ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనార్హం. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ. 5 కోట్ల నుంచి రూ. 2,514 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 27,174 కోట్ల నుంచి రూ. 33,869 కోట్లకు పెరిగింది.  

వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి)  రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్‌ పేర్కొంది. ఈ బ్యాంక్‌ కేటాయింపులు గత ఏడాది జూన్  త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్‌పీఏలు జతయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌పీఏలు రూ.4,036 కోట్లకు పెరగ్గా,  ఇప్పుడు తగ్గడం గమనార్హం. నిరర్ధక రుణా ల రికవరీలు రూ.931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్న స్థూల ఎన్ పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్  క్వార్టర్‌లో స్థూల ఎన్‌పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్‌పీఏలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది.

మరిన్ని వార్తలు