పేలవంగా ప్రుడెన్షియల్ లిస్టింగ్

30 Sep, 2016 01:24 IST|Sakshi
పేలవంగా ప్రుడెన్షియల్ లిస్టింగ్

ఇష్యూ ధర కంటే 11% నష్టంతో ముగింపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లిస్టింగ్ పేలవంగా జరిగింది. ఇష్యూ ధర(రూ.334) కంటే 1 శాతం తక్కువగా రూ.329 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. చివరకు 11 శాతం క్షీణతతో రూ.298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం క్షీణతతో రూ.295ను తాకింది. బీఎస్‌ఈలో 1.2 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 8 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,722 కోట్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి బీమా కంపెనీ ఇదే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్ నిస్తేజంగా ఉండటంతో ఆ ప్రభావం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌పై కూడా పడింది. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 4% క్షీణించి రూ.251 వద్ద ముగిసింది. రూ.300-334 ధరల శ్రేణితో వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయ్యింది. కోల్ ఇండియా(రూ.15,000 కోట్లు) తర్వాత వచ్చిన అతి పెద్ద ఐపీఓ ఇదే.

 పుష్కలంగా నిధులు: చందా కొచర్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్‌ను మించిన వృద్ధిని సాధిస్తుందని కంపెనీ చైర్‌పర్సన్ చందా కొచర్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ కంటే వేగంగా వృద్ధి చెందే సంప్రదాయం తమ కంపెనీదని, ఇదే జోరును కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయిన కొన్ని నిమిషాలకే ఆమె మాట్లాడారు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ గత 4-5 ఏళ్లలో ఏడాదికి 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని వివరించారు. ప్రస్తుతానికి తమ వద్ద పుష్కలంగా నిధులున్నాయని, మరో కొన్నేళ్లదాకా పెట్టుబడులు అవసరం లేదని పేర్కొన్నారు. ఐఆర్‌డీఏఐ నిర్దేశించిన సాల్వెన్సీ రేషియో 150 శాతమని, కానీ తమ కంపెనీ సాల్వెన్సీ రేషియో 320 శాతమని వివరించారు.

>
మరిన్ని వార్తలు