ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు 10 రెట్లు స్పందన

22 Sep, 2016 00:48 IST|Sakshi
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐపీఓకు 10 రెట్లు స్పందన

న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 10.5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. బుధవారం ఆఫర్ ముగిసే సమయానికి రూ. 46,298 కోట్ల విలువైన బిడ్స్‌ను కంపెనీ ఆకర్షించగలిగింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన రూ. 1,635 విలువైన షేర్లతో కలుపుకుంటే ఆఫర్ అందుకున్న బిడ్స్ విలువ రూ. 47,933 కోట్లకు చేరుతుంది. 10 లక్షలకుపైగా దరఖాస్తులు రావడం విశేషం. రూ. 300-334 ప్రైస్‌బ్యాండ్‌తో రూ. 6,057 కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈ ఆఫర్ జారీచేసింది. 2010లో వచ్చిన రూ. 15,000 కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూ తర్వాత ఇదే పెద్ద ఐపీఓ.

 సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా 11.83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్‌కాగా, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 28.55 రెట్ల స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా మాత్రం 1.37 రెట్లు మాత్రమే ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌హోల్డర్లకు కేటాయించిన కోటాకు 12.20 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది.

మరిన్ని వార్తలు