మరోసారి ఈడీ ముందుకు కొచర్‌ దంపతులు

14 May, 2019 13:52 IST|Sakshi
చందాకొచర్‌ దంపతులు ( ఫైల్‌ పోటో)

సాక్షి, న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌  మంగళవారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.  సోమవారం దాదాపు ఎనిమిది గంటలపాటు వీరిని  ఈడీ  ప్రశ్నించింది . వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు  రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది.  

బ్యాంకు రుణాలమంజూరులో మోసం, నగదు బదిలీ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా గతంలో ఆయన్ని ప్రశ్నించింది. వీడియోకాన్‌ గ్రూప్ రుణాలను ఐసీఐసీఐ బ్యాంక్ పునర్‌వ్యవస్థీకరించడంలో ఆయన పాత్ర గురించి విచారణ చేసింది. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ దాదాపు రూ.1,875 కోట్ల మేర రుణాలివ్వడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై చందా కొచర్‌, దీపక్‌ కొచర్‌, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ తదితరులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఏడాది క్రితం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. చందా కొచర్ సహకారంతో ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకున్న ధూత్‌.. ప్రతిగా ఆమె భర్త దీపక్‌కు చెందిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌లో ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు