వొడాఫోన్, ఐడియా మెగా మెర్జర్?

24 Aug, 2016 01:09 IST|Sakshi
వొడాఫోన్, ఐడియా మెగా మెర్జర్?

న్యూఢిల్లీ: దేశ టెలికం రంగంలో భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.! అగ్రగామి కంపెనీలు ఐడియా సెల్యులర్, వొడాఫోన్ విలీనానికి ఉన్న అవకాశాలపై ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియా సంస్థ ఒకటి వెలుగులోకి తెచ్చింది.  ఇదే నిజమైతే ఐడియా, వొడాఫోన్ విలీనంతో మార్కెట్ పరంగా దేశ టెలికం రంగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భవించనుంది. ఒకపక్క సేవల పరంగా టెలికం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నడుస్తుండగా... మరోవైపు రిలయన్స్ జియో అత్యంత వేగంతో కూడిన 4జీ సేవలను అతి తక్కువ ధరలకే అందించడం ద్వారా మార్కెట్‌ను కొల్లగొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో తాజా విలీన వార్తలు రావడం ఆసక్తికి దారితీసింది.

 విలీనానికి అడ్డంకులు...
వొడాఫోన్ ఐపీవోకు రావాలని గత కొంత కాలంగా ఆలోచన చేస్తోంది. ఈ సంస్థ విలువ 11 బిలియన్ డాలర్లుగా ఉంటుందని... ఐడియా సెల్యులర్ విలువ 5 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. రెండు కంపెనీలు విలీనమైతే సంయుక్త సంస్థ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. ఐడియా సెల్యులర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉండడంతో వొడాఫోన్ ఐపీఓకు రావాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, సంయుక్త కంపెనీ మార్కెట్ వాటా కొన్ని సర్కిళ్లలో 50 శాతానికి మించనుండడంతో నియంత్రణపరమైన అనుమతులు కష్టతరం కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. వొడాఫోన్ గతంలో టాటా టెలీసర్వీసెస్ వంటి ఇతర సంస్థలతోనూ విలీనంపై చర్చలు సాగించినా కార్యరూపం దాల్చలేదు. కాగా, తాజా విలీన వార్తలపై స్పందించేందుకు వొడాఫోన్ నిరాకరించగా... ఐడియా మాత్రం ఆధార రహితం, తప్పుడు కథనంగా పేర్కొంది.

 మూడు సంస్థల వద్దే మూడొంతుల వాటా
2015-16 ఆర్థిక సంవత్సరాంతానికి భారతీ ఎయిర్‌టెల్ 31.7 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. వొడాఫోన్ 22.7 శాతం, ఐడియా 20.2 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ మూడు సంస్థల చేతుల్లోనే 74.6 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా టాటా టెలీ, ఎయిర్‌సెల్, టెలినార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తదితర సంస్థలు పంచుకున్నాయి.

మరిన్ని వార్తలు