టెల్కోల 'క్యాష్‌'బ్యాక్‌..!

27 Nov, 2017 23:38 IST|Sakshi

వరుస ఆఫర్లతో హంగామా...

ఏఆర్‌పీయూ తగ్గకుండా చూడటమే లక్ష్యం

జియో, ఎయిర్‌టెల్‌ బాటలోనే ఐడియా..

కన్సాలిడేషన్‌ తరవాత టారిఫ్‌లు పెరగొచ్చు: నిపుణులు  

దేశీ టెలికం పరిశ్రమలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఉన్న కస్టమర్లను కాపాడుకోవటమే కాక... కొత్త యూజర్లను ఆకర్షించాలి కనుక పోటీ మరింత పెరిగింది. అన్నింటికీ మించి ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యతా పడింది. అందుకే టెలికం సంస్థలు ఇపుడు వరుసపెట్టి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. 

కంపెనీల 100 శాతం క్యాష్‌బ్యాక్‌..!! 
రిలయన్స్‌ జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ప్రైమ్‌ యూజర్లు రూ.399, ఆపై టారిఫ్‌ల రీచార్జ్‌లపై ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఇదే దార్లో ఎయిర్‌టెల్‌ కూడా ఇలాంటి ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. రూ.349 రీచార్జ్‌పై ఇది వర్తిస్తుంది. ఐడియా సైతం రూ.357తో రీచార్జ్‌ చేస్తే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ అని ప్రకటించింది. కాకపోతే ఈ ఆఫర్లు అన్నిటికీ పరిమితులుంటాయి. మొత్తం క్యాష్‌బ్యాక్‌ వచ్చినా... దాన్ని యూజర్లు ఒకే సారి వినియోగించుకోలేరు. వరుసగా ఓ ఏడాదో, పదిసార్లో రీచార్జ్‌ చేస్తే ఆ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. అంటే... అప్పటిదాకా యూజర్లను తమ సర్వీసులకు కట్టుబడేలా చూసుకోవచ్చు. అదీ కథ.  

ఏఆర్‌పీయూలో 40 క్షీణత 
టెలికం కంపెనీలకు ఏఆర్‌పీయూనే కీలక కొలమానం. ఇందులో వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ సెప్టెంబర్‌లో 40 శాతం క్షీణత నమోదైంది. దీనికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా జియో ఎంట్రీతో ధరల పోటీ మొదలైంది. దీంతో బండిల్‌ వాయిస్, డేటా ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు!! ‘టెలికం పరిశ్రమలోని తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెల్కోలు కస్టమర్లను రక్షించుకునేందుకు తీవ్రంగానే కష్టపడుతున్నాయి. అందుకే పలు ప్లాన్లను ఆవిష్కరిస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌ అనేది వాటిల్లో ఒక రకం’ అని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ చెప్పారు. కాగా టెలికం సంస్థలు ప్రస్తుతం రూ.340–రూ.380 ధరల శ్రేణిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయని కౌంటర్‌పాయింట్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ సత్యజిత్‌ సిన్హా చెప్పారు. ‘‘ఇది వరకు టెల్కోలు వేర్వేరు ధరల శ్రేణిలో వివిధ ఆఫర్లను ప్రకటించేవి. ఇవి తక్కువ ధరల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఆపరేటర్లు రూ.340–రూ.380 ధరల శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. దీంతో ఏఆర్‌పీయూ అనేది పెరిగితే పెరుగుతుంది, లేకపోతే స్థిరంగా ఉంటుంది, అంతేకానీ తగ్గదని తెలిపారు. ఏడాది కిందట టెల్కోలు రూ.250–260 ధరల శ్రేణిపై దృష్టి కేంద్రీకరించాయన్నారు. 

టారిఫ్‌లు పెరుగుతాయ్‌!! 
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కొన్నాళ్లే పనిచేస్తాయని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్, కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. వీటి ద్వారా పరమిత కాలమే యూజర్లను ఆకర్షించొచ్చన్నారు. ఆఫర్లతో స్వల్పకాలంలో ఏఆర్‌పీయూలో పెరుగుదల ఉండొచ్చన్నారు. పరిశ్రమలో వచ్చే 6–9 నెలల్లో స్థిరీకరణ పూర్తవుతుందని అంచనా వేశారు. ‘‘అప్పుడు మూడు కంపెనీలే ఉంటాయి. ఆ తర్వాత నుంచి టారిఫ్‌లు క్రమంగా పెరుగుతాయి. ఎందుకంటే జియో ఎంట్రీతో ఐడియా, వొడాఫోన్‌ విలీనమౌతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌.. టాటా టెలీసర్వీసెస్‌ వైర్‌లెస్‌ బిజినెస్‌ను సొంతం చేసుకుంటోంది. ఇది టెలినార్‌ ఇండియాను కొనేసింది. ఇక రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తన 2జీ, 3జీ వాయిస్‌ బిజినెస్‌ను మూసేసింది. ఎయిర్‌సెల్‌ తన కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు.   

మరిన్ని వార్తలు