ఎయిర్‌సెల్‌ యూజర్లకు ఐడియా షాక్‌

7 Feb, 2018 14:16 IST|Sakshi
ఎయిర్‌సెల్‌తో ఐడియా ఇంటర్‌కనెక్ట్‌ సర్వీసులు రద్దు (ఫైల్‌)

న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌ యూజర్లకు ఐడియా సెల్యులార్‌ షాకిచ్చింది. బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్‌తో ఉన్న ఇంటర్‌కనెక్ట్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఆ కంపెనీకి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని ఐడియా పేర్కొంది. ఎయిర్‌సెల్‌ ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన తర్వాత ఇంటర్‌కనెక్ట్‌ సర్వీసులను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు తాము ఈ సర్వీసులను అందజేయమని వెల్లడించింది. అయితే ఎంతమొత్తంలో ఎయిర్‌సెల్‌ బాకీ పడి ఉందో ఐడియా తెలుపలేదు.  

'' బకాయిలు చెల్లించని కారణంగా ఎయిర్‌సెల్‌ లిమిటెడ్‌తో మా ఇంటర్‌కనెక్ట్‌ సర్వీసులను రద్దు చేస్తున్నాం'' అని ఐడియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2017 నవంబర్‌ నుంచి పలుమార్లు ఈ బకాయిలు చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను కోరామని, కానీ ఆ ఆపరేటర్‌ బకాయిలు చెల్లించడంలో విఫలమైనట్టు పేర్కొంది. ఇంటర్‌కనెక్ట్‌ అగ్రిమెంట్‌ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.  కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌సెల్‌ ఈ పేమెంట్లను చెల్లిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్‌సెల్‌ వెంటనే స్పందించలేదు. 
 

మరిన్ని వార్తలు