ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాలు రూ.370 కోట్లు 

25 Oct, 2018 00:57 IST|Sakshi

మెరుగుపడిన రుణ నాణ్యత

పెరిగిన కేటాయింపులు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.370 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గతేదాది ఇదే క్వార్టర్‌లో రూ.234 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు పెరగడంతో ఈ క్యూ2లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది.  

తగ్గిన మొండి బకాయిలు... 
గత క్యూ2లో రూ.2,365 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.2,453 కోట్లకు పెరిగిందని ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. రుణ నాణ్యత మెరుగుపడిందని పేర్కొంది. గత క్యూ2లో 3.92 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 1.63 శాతానికి తగ్గాయని తెలిపింది. అలాగే నికర మొండి బకాయిలు 1.61 శాతం నుంచి 0.59 శాతానికి తగ్గాయని వివరించింది. అంకెల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,002 కోట్ల నుంచి రూ.895 కోట్లకు, నికర మొండి బకాయిలు  రూ.805 కోట్ల నుంచి రూ.321 కోట్లకు తగ్గాయని తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా,  కేటాయింపులు మాత్రం రూ.601 కోట్లకు పెంచామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 2.3 శాతం లాభంతో రూ.35.20 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు