బాండ్లలో స్థిరమైన రాబడుల కోసం

9 Dec, 2019 01:51 IST|Sakshi

ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ – మీడియం టర్మ్‌ ప్లాన్‌

ఆర్‌బీఐ ఇప్పటి వరకు 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించి, తాజా పాలసీలో యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు నియంత్రణ తప్పొచ్చన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా అనిశ్చితి ఇవన్నీ దేశీయ బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపించేవే. కనుక ఈ రిస్క్‌లను అధిగమించేందుకు ఇన్వెస్టర్లు (తక్కువ నుంచి మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు) షార్ట్, మీడియం టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ (స్వల్ప కాలం నుంచి మధ్య కాల ఫండ్స్‌)ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ – మీడియం టర్మ్‌ ప్లాన్‌ (ఎంటీపీ) మంచి పనితీరుతో అగ్ర స్థానంలో ఉంది.

రాబడులు..: ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ ఎంటీపీ గత ఐదేళ్ల పనితీరును గమనించినట్టయితే.. వార్షికంగా 8 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. కానీ, మీడియం టర్మ్‌ డెట్‌ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 7.5 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ ఎంటీపీ వార్షికంగా 7.2 శాతం రాబడులను ఇవ్వగా, ఈ విభాగం సగటు రాబడులు కేవలం 5.9 శాతంగానే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. కానీ, ఈ విభాగం రాబడులు 5.9 శాతం వద్దే ఉన్నాయి. ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో మీడియం టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ విభాగం కంటే ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌– ఎంటీపీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పెట్టుబడుల విధానం 
సెబీ మార్గదర్శకాల ప్రకారం మీడియం టర్మ్‌ బాండ్‌ ఫండ్స్‌ మూడు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్‌ వడ్డీ రేట్ల రిస్క్‌ను అధిగమించే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక బాండ్లతో పోలిస్తే మీడియం టర్మ్‌ బాండ్లు వడ్డీ రేట్ల పరంగా తక్కువ అస్థిరతలతో ఉంటుంటాయి. ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ ఎంటీపీ ప్రధానంగా ఏఏఏ రేటింగ్‌ కలిగిన సౌర్వభౌమ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

క్రెడిట్‌ రిస్క్‌ వాతావరణం అననుకూలంగా ఉన్న సమయాల్లో అధిక రేటింగ్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఈ తరహా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను పెట్టుబడుల పరంగా భద్రతగా భావించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ పథకం ఐడీఎఫ్‌సీ సూపర్‌ సేవర్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌ – మీడియం టర్మ్‌ ప్లాన్‌ పేరుతో కొనసాగింది. రెండు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే ఈ పథకం ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అస్థిర మార్కెట్లలోనూ మంచి పనితీరు చూపించగలిగింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 42.8 శాతం కేంద్ర ప్రభుత్వం బాండ్లు, 50.4 శాతం మేర ఏఏఏ రేటింగ్‌ కార్పొరేట్‌ బాండ్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు