ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో శ్రీరామ్‌ ఎన్‌బీఎఫ్‌సీల విలీనం!

7 Jul, 2017 00:30 IST|Sakshi
ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో శ్రీరామ్‌ ఎన్‌బీఎఫ్‌సీల విలీనం!

కొన్ని కంపెనీలతో చర్చలు
జరుపుతున్నాం– ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌
వివిధ ఆప్షన్లు: శ్రీరామ్‌ గ్రూప్‌


ముంబై: కొద్ది నెలల క్రితమే రిజర్వుబ్యాంక్‌ నుంచి బ్యాంకింగ్‌ లైసెన్సు పొంది, కార్యకలాపాలు ప్రారంభించిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌...శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన రెండు నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను (ఎన్‌బీఎఫ్‌సీలు) విలీనం చేసుకోవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ విలీనంపై అంచనాలతో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు వరుసగా మూడు సెషన్ల నుంచి 15 శాతం వరకూ ర్యాలీ జరిపింది. శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీలు.. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ సిటీయూనియన్‌ ఫైనాన్స్‌లు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కావొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. విలీనంతో పాటు పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని, సరైన సమయంలో టేకోవర్లు, విలీనాలపై నిర్ణయం తీసుకునేందుకు తాము సిద్దంగానే వున్నామని శ్రీరామ్‌ గ్రూప్‌నకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

శనివారం బోర్డు సమావేశాలు..
వివిధ వ్యూహాత్మక ఆప్షన్లు పరిశీలించేందుకు ఈ శనివారం శ్రీరామ్‌ క్యాపిటల్‌ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుంది. ఇదేరోజున ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డు సమావేశం కూడా జరగనుండటం విశేషం.  అయితే ఇరు కంపెనీలు బోర్డు సమావేశాల సమాచారాన్ని ఇంకా స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలపలేదు. విలీన వార్తలపై ఎక్సే్ఛంజీలు కోరిన వివరణకు ఐడీబీఐ బ్యాంక్‌ సమాధానమిస్తూ వివిధ వృద్ధి అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు మాత్రమే తెలిపింది.   ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 21,545 కోట్లు. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 7,644 కోట్లుకాగా, శ్రీరామ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ఫైనాన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 25,138 కోట్లు. గురువారం ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు రూ. 63.30 వద్ద క్లోజైంది. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ షేరు రూ. 1,111 వద్ద, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ రూ. 2,510 వద్ద ముగిశాయి.

మరిన్ని వార్తలు