కలిస్తే లాభమెవరికి?

11 Jul, 2017 01:00 IST|Sakshi
కలిస్తే లాభమెవరికి?

ఐడీఎఫ్‌సీ– శ్రీరామ్‌ విలీనంపై భిన్న స్వరాలు
విలీనం పట్టాలెక్కుతుందా అంటూ సందేహాలు
సాఫీగా జరిగితే ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు మేలే!


ఐడీఎఫ్‌సీ గ్రూపు, శ్రీరామ్‌ గ్రూపు కంపెనీల భారీ స్థాయి విలీనంపై చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో దీనివల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్న విషయంలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో నిజంగా ఈ విలీనం లాభాన్ని అందిస్తుందా, నష్టాలకు దారితీస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ విలీనమే జరిగితే దేశంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్‌ తర్వాత ఐడీఎఫ్‌సీ సైతం ఆర్థిక సేవల దిగ్గజ గ్రూపుగా అవతరిస్తుంది.

ఐడీఎఫ్‌సీ, శ్రీరామ్‌ హోల్డింగ్‌ కంపెనీ అన్నింటికీ ప్రమోటింగ్‌ కంపెనీగా ఉంటుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంకులో శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ విలీనం కావొచ్చని భావిస్తున్నారు. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ సైతం విలీనం కావచ్చన్న అంచనాలు వెలువడగా, ఇది అనుబంధన కంపెనీగా కొనసాగి, తర్వాత కాలంలో విలీనం కావడం లేదా డీలిస్టింగ్‌ చేయడం ఏదో ఒకటి జరుగుతుందని, అయితే ఆర్‌బీఐ అనుమతి మేరకే ఈ చర్య ఉంటుందని భావిస్తున్నారు. ఇక శ్రీరామ్‌ గ్రూపు బీమా వ్యాపారాలు ఐడీఎఫ్‌సీలో విలీనం అవుతాయి. ఇవీ ప్రస్తుత అంచనాలు.

ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు లాభం ఎలా?
పేరెంట్‌ కంపెనీ ఐడీఎఫ్‌సీ నుంచి ఐడీఎఫ్‌సీ బ్యాంకుగా అవరించినప్పటికీ మొత్తం రుణాల్లో ఇన్‌ఫ్రా రంగానికి ఇచ్చినవే 50 శాతానికిపైగా ఉన్నాయి. దీంతో ఈ ముద్ర నుంచి బయటకు రావాలన్నది ఐడీఎఫ్‌సీ బ్యాంకు ప్రయత్నం. ప్రస్తుతం బ్యాంకు రుణాల్లో రిటైల్‌ రంగ వాటా 24 శాతంగా ఉంది. కస్టమర్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో ఇటీవలి కాలంలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థ గ్రామ విదియాల్‌ను కొనుగోలు చేసింది. ఇక, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటే గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆ సంస్థకు భారీ సంఖ్యలో ఉన్న చిన్న కస్టమర్లు ఐడీఎఫ్‌సీ బ్యాంకుకు సొంతం అవుతారు. చిన్న, మధ్య స్థాయి సంస్థల రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, బంగారం, గృహ రుణాల ద్వారా ఐడీఎఫ్‌సీ రిటైల్‌ రుణ విభాగంలో బలోపేతం కాగలదు. రుణ పుస్తకానికి తగ్గ స్థాయిలో డిపాజిట్లు పెంచుకోకపోతే శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌కు సంబంధించి ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్‌ నిబంధనలు అమలు దృష్ట్యా బ్యాంకు మార్జిన్లపై ప్రభావం పడుతుంది. విలీనం నిర్ణయం సులభమే అయినా, క్షేత్ర స్థాయిలో సర్దుకునేందుకు ఏళ్లు పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పిరమల్స్‌ వాటాలతో సమస్యలు?
పిరమల్‌ గ్రూపునకు శ్రీరామ్‌ సిటీ గ్రూపు కంపెనీల్లో భారీ వాటాలున్నాయి. విలీనం తర్వాత ఐడీఎఫ్‌సీ బ్యాంకులో పిరమల్‌ గ్రూపునకు 5 శాతానికి పైగా వాటా దక్కుతుంది. ఈ నేపథ్యంలో విలీనంపై ఆర్‌బీఐ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ డీల్‌ విలువ 2016–17 ఆర్థిక సంవత్సరం శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ పుస్తక విలువకు 3.5 రెట్ల విలువ స్థాయిలో జరగకుంటే మాత్రం ఆ సంస్థ వాటాదారులకు నష్టమే.

వాటాదారులకు ఫలితం ఉందా?
‘‘నాలుగు లిస్టెడ్‌ కంపెనీల్లో శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ వాటాదారులకు ప్రస్తుత స్థాయిలకు మించి మెరుగైన ప్రతిఫలం దక్కకపోవచ్చు. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ను గనుక డీలిస్ట్‌ చేస్తే వాటాదారులకు అధిక విలువ దక్కొచ్చు. విలీన నిష్పత్తిని బట్టి ఐడీఎఫ్‌సీ బ్యాంకు షేరు ధర సమీప కాలంలో పెరగడం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇరు సంస్థల ఏకీకరణ సాఫీగా సాగి, డిపాజిట్లు రుణాల పరంగా అసమతుల్యత అంశాన్ని పరిష్కరించుకోగలిగితే వాటాదారులకు ప్రయోజనం ఉంటుంది. శ్రీరామ్‌ క్యాపిటల్‌ మాత్రం ఐడీఎఫ్‌సీ కిందకు రాకపోవచ్చు. ఇక శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మార్కెట్‌ వాటా కేవలం 0.50 శాతమే. జనరల్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ వాటా 1.44 శాతం. వీటివల్ల ఐడీఎఫ్‌సీకి పెద్దగా లాభించకున్నా ఆర్థిక సేవల పరంగా అతిపెద్ద సంస్థగా అవతరించేందుకు సాయపడగలవు. సరైన దిశలో విలీన ప్రక్రియ సాగితే హోల్డింగ్‌ కంపెనీగా ఐడీఎఫ్‌సీ వాటాదారులకు అధిక ప్రతిఫలం దక్కేందుకు అవకాశం ఉంది’’ అన్నది విశ్లేషకుల అంచనా.

మరిన్ని వార్తలు