ఐఐసీటీలో ఏపీఐల తయారీ

25 Apr, 2020 05:27 IST|Sakshi

లాక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌తో కుదిరిన ఒప్పందం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషదాల తయారీలో అతిముఖ్యమైన యాక్టివ్‌ ఫార్మాసూటికల్స్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ), ఇతరత్రా ముడిపదార్థాలను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ లాక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫెనోవిర్, రెమిడిసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) వంటి ఔషదాల తయారీ మీద దృష్టిపెడతామని ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఐఐసీటీలో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యుల్స్, లాక్సాయ్‌లో ఫార్ములేషన్స్, డ్రగ్స్‌ తయారవుతాయని ఐఐసీటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాక్సాయ్‌కు హైదరాబాద్‌లో యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ఏపీఐ తయారీ కేంద్రాలున్నాయి. గతంలో ఎబోలా వైరస్‌ రోగులకు అందించిన రెమ్‌డిసివిర్‌ డ్రగ్‌ను ప్రస్తుతం కరోనా చికిత్స కోసం సమర్థవంతంగా పని చేస్తుందని, ఈ మేరకు డ్రగ్‌ పనితీరు, భద్రత అంశాలను అంచనా వేయడానికి క్లినికల్‌ ట్రయల్స్‌జరుగుతున్నాయని ఐఐసీటీ తెలిపింది.  కరోనా వైరస్‌ నేపథ్యంలో  కేంద్ర మంత్రివర్గం ఏపీఐల కోసం చైనా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే బల్క్‌ డ్రగ్‌ తయారీని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు