మీ ‘కేర్’ మీ చేతుల్లోనే...

14 Feb, 2015 02:29 IST|Sakshi
మీ ‘కేర్’ మీ చేతుల్లోనే...

అద్భుతాలు చేయడానికి బడా బడా కంపెనీలే అక్కర్లేదు. మల్టీ మిలియన్ డాలర్ల పెట్టుబడీ అవసరం లేదు. ఓ మంచి ఐడియా... దాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పం... నెరవేర్చుకునే నైపుణ్యం... ఈ మూడూ ఉంటే చాలు. నిజమే! ఈ మూడు లక్షణాలతో మొదలైన స్టార్టప్‌లు అద్భుతాలు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి స్టార్టప్ కంపెనీలను వెదికి... వాటి వివరాలను పాఠకులకు అందించటాకే ‘సాక్షి’ ఈ ‘స్టార్టప్ డైరీ’ని ఆరంభిస్తోంది.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుంచి నివేదికలన్నీ ఆన్‌లైన్లోనే
అదికూడా... అర్థమయ్యే భాషలో సరళీకరణ
హైదరాబాదీ స్టార్టప్ ‘ఈ కిన్‌కేర్’ ఉచిత సేవలు
రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హలో... అమ్మా ఒంట్లో ఎలా ఉంది? టైంకి మందులేసుకుంటున్నారా? మళ్లీ చెకప్‌కు డాక్టర్ ఎప్పుడు రమ్మన్నాడు?
ఎవరైనా ఎన్నారై తన ఇంటికి ఫోన్ చేస్తే చాలు... ఈ మాటలు ఉండాల్సిందే. తరవాత తల్లిదండ్రులు చెప్పిన వివరాలు విని ఆదుర్దా పడటం... వీలైతే తనకు తెలిసిన ఓ డాక్టర్నో, ఆసుపత్రినో సూచించటం. ఇప్పటిదాకా అంతే!!

అయితే ఇలాంటి చెకప్‌లకు చెక్ పెడుతోంది ekincare.com.ఫోన్‌లో మాట్లాడటంతోనే వదిలిపెట్టకుండా ఆ ఫోన్లోనే మనవాళ్ల ఆరోగ్య వివరాలూ తెలుసుకునేందుకు వీలుగా ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కే. కలకుంట్ల. కంపెనీకి సంబంధించి ‘సాక్షి’తో ఆయన ఏం చెప్పారంటే...
 
అమెరికా ఉద్యోగం వదిలిపెట్టి...
హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2004లో ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లా. నాకైతే చిన్నప్పటి నుంచీ సొంత కంపెనీ పెట్టాలని ఉండేది. యూఎస్‌లో టెలికం సేవల కంపెనీ ఐటీఅండ్‌టీలో నార్త్ అమెరికా మేనేజర్‌గా పనిచేశా. 2013లో ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చా. జనానికి, సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఓ కొత్త కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. మొదట్లో ఎవరూ నా నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. బంగారంలాంటి ఉద్యోగం వదిలేసి ఎదుకొచ్చావన్నారు. అయినా బాధపడలేదు. నాకైతే నమ్మకం ఉంది. సొంత కంపెనీ పెట్టి ఎదుగుతానని.
 
ఆ పేరెందుకంటే...
e ఎలక్ట్రానిక్స్... kin కుటుంబీకులు/బంధువులు/శ్రేయోభిలాషులు... care శ్రద్ధ అని అర్థం. అంటే మొత్తంగా చూస్తే.. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ద్వారా మన వాళ్ల ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ వహించడమన్నమాట.
 
మా సేవలు కావాలంటే...
ekincare సేవలు వినియోగించుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ekincare యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్‌లో భద్రపరచాలనుకుంటున్న మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్‌ను, డాక్టర్ సమ్మరీలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా ఫొటో తీసి యాప్‌లోకి అప్‌లోడ్ చేయాలి.
 
సులువుగా అర్థమయ్యేలా...
డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌గానీ, ల్యాబ్ రిపోర్టులు గానీ ఇవేవీ మనకు సులువుగా అర్థమయ్యేవి కావు. డాక్టర్ చెప్పింది నమ్మడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కానీ, ekincareలో మాత్రం వచ్చిన వ్యాధేంటి? అది ఏ స్థాయిలో ఉంది? వంటి విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ.. క్లయింట్లకు అర్థమయ్యే భాషలో వాటిని సరళంగా చెబుతాం. వాటి వివరాలను గ్రాఫులు, రంగుల రూపంలో తెలియజేస్తాం. (ఎరుపు రంగుంటే ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు.. పసుపు రంగుంటే జాగ్రత్తలు తీసుకుంటే మేలని గుర్తుగా..) సంబంధిత వ్యాధి తాలూకు చరిత్ర, తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తాం. తలనొప్పి నుంచి మొదలుపెడితే గుండె పోటు వరకు సుమారు 150కి పైగా వ్యాధులకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌లో భద్రపరచుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తున్నాం.
 
దేశవ్యాప్తంగా 1,500కి పైగా ఆసుపత్రుల్లో...
దేశవ్యాప్తంగా 1,500కు పైగా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు మా సంస్థతో అనుసంధానమై ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో డాక్టర్ అపాయింట్‌మెంట్లను కూడా మా యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారి రిపోర్ట్‌లు పరీక్షల తరవాత నేరుగా మేమే తీసుకుంటాం. వాటిని సరళీకరించి యాప్‌లో అప్‌లోడ్ చేస్తాం. క్లయింట్ నేరుగా తన మొబైల్‌లోనే వీటిని చూసుకోవచ్చు. తర్వాతి చెకప్ మళ్లీ ఎప్పుడుం టుందో ముందుగానే చెబుతాం కూడా. ప్రస్తుతం అపోలో డెంటల్, మాక్సి విజ న్, పార్థ డెంటల్, వాసన్ ఐ కేర్, విజయ డయాగ్నస్టిక్స్, తపాడియా, థైరో కేర్, డాక్టర్ లాల్ ఆసుపత్రులతో కంపెనీ అనుసంధానమై ఉంది. త్వరలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఆసుపత్రుల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
 
త్వరలో హోమ్ హెల్త్‌కేర్‌లోకి...
ఇప్పటివరకు క్లయింట్స్ నివేదికలను ఆన్‌లైన్‌లో భద్రపరచడమే చేస్తున్నాం. ఈ నెలాఖరుకల్లా డయాబెటిస్, అధిక రక్తపోటు, కార్డియో వాస్క్యులర్ (గుండె- రక్తనాళాలకు సంబంధించి) వ్యాధులకు చికిత్సలు కూడా చేస్తాం. అది కూడా నేరుగా ఇంటికి వెళ్లి. దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్లను నియమించాం. ఆ రోగుల నివేదికలను కూడా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తాం. రూ.2 వేలకు కుటుంబంలోని ఇద్దరికి మొత్తం బాడీ చెకప్ చేస్తాం. ఇందులో సుమారుగా 70 రకాల చెకప్‌లుంటాయి.
 
రూ.2 కోట్ల పెట్టుబడులు..: అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చాక దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి కంపెనీని ప్రారంభించా. గతేడాది నవంబర్‌లో మార్కెట్‌లోకి వచ్చాం. ప్రస్తుతానికి కంపెనీలో 1,000 మంది క్లయింట్లు రిజిస్టరై ఉన్నారు. ఇటీ వలే బిట్చెమీ వెంచర్ క్యాపిటల్, యూఎస్ కంపెనీ అయిన అడ్రాయిటెంట్ కంపెనీలు రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిని పూర్తిగా కంపెనీ విస్తరణ, మార్కెటింగ్ కోసం వినియోగిస్తున్నాం.
అద్భుతమైన స్టార్టప్ ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే bussiness@sakshi.com కు మెయిల్ చేయండి....

మరిన్ని వార్తలు