ఐకియా స్టోర్‌ : వెజ్‌ బిర్యానీ, సమోసా అమ్మకం బంద్‌

5 Sep, 2018 20:35 IST|Sakshi

హైదరాబాద్‌ : నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో వెజిటేబుల్‌ బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వాహకులకు రూ.11,500 జరిమానా కూడా విధించారు. తాజాగా ఐకియా ఇండియా, తన స్టోర్‌లో వెజిటేబుల్‌ బిర్యానీని, సమోసాను అమ్మడం నిలిపివేసింది. తనకు తానుగా వీటి విక్రయాలను ఐకియా స్టోర్‌ క్లోజ్‌ చేసింది. 

నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించేందుకు బలమైన అంతర్గత ప్రక్రియను పాటిస్తున్న ఐకియా, తన సప్లయ్‌ చైన్‌ పూర్తి బాధ్యతను తన తలపైనే వేసుకుంది. ఈ క్రమంలోనే వెజిటేబుల్‌ బిర్యానీని, సమోసాను అమ్మడం మానేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సరియైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అంతర్గత సమీక్ష చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాక తమ లోపాలను సరిచేసుకుంటామని ఐకియా తెలిపింది. రివ్యూ ప్రాసెస్‌ అయిపోయిన తర్వాత ఈ రెండింటి అమ్మకాలను చేపడతామని కంపెనీ తెలిపింది. ఆహారంలో నాణ్యతను, భద్రతను ఈ కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుంది. వినియోగదారుల ఆరోగ్యానికి ఇది పెద్ద పీట వేస్తుంది. తొలి నెల కార్యకలాపాల్లో భాగంగా ఐకియా ఇండియాకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 
 

మరిన్ని వార్తలు