ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నిధుల ప్రణాళికకు ఇన్వెస్టర్ల ఆమోదం

1 Oct, 2018 02:06 IST|Sakshi

రూ. 15 వేల కోట్ల సమీకరణ...

ముంబై: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌)కి కాస్త ఊరట లభించే దిశగా దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థలో ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. నాన్‌ కన్వర్టబుల్‌ డెట్‌ ఇష్యూ ద్వారా ఈ నిధులను సంస్థ సమీకరించనుంది.

అలాగే రుణ సమీకరణ పరిమితిని రూ. 35,000 కోట్ల దాకా (40 శాతం మేర) పెంచుకునేందుకు, రైట్స్‌ ఇష్యూకి వీలుగా షేర్‌ క్యాపిటల్‌ను పెంచుకునేందుకు కూడా వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు, పునర్‌వ్యవస్థీకరణను రూపొందించేందుకు అల్వారెజ్‌ అండ్‌ మార్సల్‌ సంస్థను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నియమించుకుంది.

దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంస్థలు.. రీపేమెంట్‌లో డిఫాల్ట్‌ అవుతుండటం.. స్టాక్‌ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, జపాన్‌కి చెందిన ఒరిక్స్‌ కార్పొరేషన్‌ మొదలైన వాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు