ఆన్ లైన్ లోకి ఫ్యూచర్ గ్రూప్!

24 Feb, 2016 00:56 IST|Sakshi
ఆన్ లైన్ లోకి ఫ్యూచర్ గ్రూప్!

ఓమ్నీ చానల్ వ్యూహం..
మూడు నెలల్లో ఈ-జోన్‌తో ప్రారంభం
ఆ తర్వాతే బిగ్ బజార్, షాపర్స్ స్టాప్‌లకు విస్తరణ
‘బ్రిక్స్ అండ్ క్లిక్’ సదస్సులో ఫ్యూచర్ గ్రూప్ జేఎండీ రాకేష్ బియానీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన దేశీ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్... త్వరలో ఆన్‌లైన్లోకి ప్రవేశిస్తోంది. దేశవ్యాప్తంగా 200కు పైగా స్టోర్లలో 1.7 కోట్ల చదరపుటడుగుల రిటైల్ స్పేస్ ఉన్న ఈ సంస్థ... ఓమ్నీ చానల్  పేరిట మూడు నెలల్లో ఆన్‌లైన్లోకి దిగుతున్నట్లు గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ బియానీ చెప్పారు. మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘మొదట ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఈ-జోన్ (ఎలక్ట్రానిక్ ఉపకరణాలు) స్టోర్లలో ఈ సేవలను ప్రారంభిస్తాం. ఆ తర్వాత ప్లానెట్ స్పోర్ట్స్, బిగ్ బజార్, షాపర్స్ స్టాప్ స్టోర్లకూ విస్తరిస్తాం’’ అని చెప్పారు.  ఓమ్నీ చానల్ ప్రత్యేకతను వివరిస్తూ ‘‘కస్టమర్లు మొబైల్, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దగ్గర్లోని ఏదైనా ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లలో ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇది రెండు రకాలుగానూ ఉంటుంది.

అవసరమైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి.. స్టోర్‌కు వెళ్లి ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదంటే స్టోర్‌కి వెళ్లి ఆర్డర్ ఇస్తే.. ఆయా ఉత్పత్తులను ఇంటికి కూడా డెలివరీ చేస్తాం. దీనివల్ల స్టోర్ల విక్రయాలకు ఆన్‌లైన్ విక్రయాలు జతకలుస్తాయి’’ అని బియానీ వివరించారు. ఓమ్నీ చానల్ షాప్, టెక్నాలజీ అభివృద్ధి కోసం హైబ్రిస్ సాఫ్ట్‌వేర్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఓమ్నీ చానల్ విధానంతో 30% మేర స్టోర్ల ఆదాయం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘బ్రిక్స్ అండ్ క్లిక్స్’ పేరుతో ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ రిటైల్ అంశంపై జరిగిన సదస్సులో బియానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు హీలియన్ వెంచర్ పార్ట్‌నర్ శ్రీకాంత్ సుందరరాజన్, యాక్టస్ అడ్వైజరీ ప్రై.లి. కో-ఫౌండర్, ఎండీ మనీష్ చద్దా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ బియానీ మాట్లాడుతూ.. ఓమ్నీ చానల్ రిటైల్‌లో 40 వేల నుంచి 60 వేల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆఫ్‌లైన్‌లో ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయో ఆన్‌లైన్‌లోనూ అవే వర్తిస్తాయని తెలియజేశారు.

ఐదేళ్లలో 300 పట్టణాలకు...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 పట్టణాల్లో 200లకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నామని ఏటా 20-30 స్టోర్లను ప్రారంభిస్తామని రాకేష్ బియానీ చెప్పారు. .. ఐదేళ్లలో 300 పట్ణణాలకు విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ ద్వారా ఫ్యాషన్, ఫుడ్, హోమ్ మూడు విభాగాల్లో కలిపి మొత్తం 40 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మరో 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. ‘‘ఇపుడు మా గ్రూప్ కస్టమర్ల సంఖ్య 33 కోట్లు. మాకు హైదరాబాద్‌తో ఎనలేని అనుబంధం ఉంది. పంజగుట్టలో తొలి స్టోర్‌ను ప్రారంభించాక షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, పాంటలూన్స్ ఇలా అన్ని స్టోర్ల ఆరంభానికీ తొలి వేదిక హైదరాబాదే’ అన్నారాయన.

>
మరిన్ని వార్తలు