29 వేల కోట్లు కట్టాల్సిందే..!

16 Mar, 2016 00:07 IST|Sakshi
29 వేల కోట్లు కట్టాల్సిందే..!

కెయిర్న్ ఎనర్జీకి ఐటీ శాఖ తుది నోటీసులు
దీన్లో అసలు 10.247 కోట్లు; మిగిలిందంతా వడ్డీయే
క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిందేనంటున్న ఐటీ శాఖ
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ బాటలో కెయిర్న్ ఎనర్జీ

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి కేంద్రం రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకు పన్ను వర్తింపు) పన్ను షాకిచ్చింది. 2006లో కంపెనీ భారత్ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన మూలధన లాభాలకుగాను రూ.29,000 కోట్లకుపైగా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఇందులో అసలు పన్ను మొత్తం రూ.10,247 కోట్లు. ఇక 2007 నుంచి ఈ పన్నుపై వడ్డీ రూపంలో 18,800 కోట్లు కట్టాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఐటీ శాఖ తొలిసారిగా 2014, జనవరి 22న ముసాయిదా అసెస్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా గత నెలలో వడ్డీతో కలిపి తుది అసెస్‌మెంట్ ఆర్డర్‌ను ఇచ్చింది. 2015 ఏడాదికిగాను ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ ఈ వివరాలను వెల్లడించింది. కాగా, వొడాఫోన్ తర్వాత ఈ ఏడాది రెట్రోస్పెక్టివ్ పన్ను నోటీసును అందుకున్న రెండో కంపెనీ కెయిర్న్ ఎనర్జీ. అందులోనూ ఈ రెండూ బ్రిటన్‌కు చెందినవే కావడం గమనార్హం.

 బడ్జెట్‌లో ప్రకటనకు ముందే...
రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా 2016-17 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వన్‌టైమ్ వడ్డీ, జరిమానా మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్ను అసలును చెల్లించిన వారికి ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రకటనకు ముందే ఐటీ శాఖ తుది అసెస్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. 2012లో రెట్రోస్పెక్టివ్ పన్నును ఐటీ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కెయిర్న్ ఎనర్జీకి విధించిన పన్నుపై 2007 నుంచి వడ్డీని లెక్కించడం గమనార్హం. కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును కెయిర్న్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఈ పన్ను వివాదంపై తాము అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పన్ను నోటీసు కారణంగా తమ వాటాదారులకు వచ్చిన నష్టానికి, కెయిర్న్ ఇండియాలో తమకున్న 9.8 శాతం వాటా షేర్లను విక్రయించకుండా నిలుపుదల(ఫ్రీజ్) చేసినందుకుగాను బిలియన్ డాలర్లను(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కూడా కెయిర్న్ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. తమ నుంచి ఐటీ శాఖ ఏదైనా రికవరీ చేసుకోగలిగితే ఈ దాదాపు 10 శాతం వాటా(విలువ దాదాపు 47.7 కోట్ల డాలర్లు)కు మాత్రమే పరిమితవుతుందని కెయిర్న్ పేర్కొంది.

 కెయిర్న్‌కు రూ.24,503 కోట్ల మూలధన లాభం: ఐటీ శాఖ
2006లో భారత్ కార్యకలాపాలకు చెందిన షేర్లను(అసెట్స్) అప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్సిడరీ కెయిర్న్ ఇండియాకు బదలాయించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ రూ.24,503 కోట్ల మూలధన లాభాన్ని ఆర్జించిందని ఐటీ శాఖ వాదిస్తోంది. ఈ ఆస్తుల బదలాయింపు తర్వాత కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కి వచ్చింది. దీనిద్వారా రూ.8,616 కోట్లను కంపెనీ సమీకరించింది. 2011లో కెయిర్న్ ఇండియాలోని మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్‌నకు కెయిర్న్ ఎనర్జీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ 8.67 బిలియన్ డాలర్లు.  కెయిర్న్ ఇండియా పాత యాజమాన్యం కెయిర్న్ ఎనర్జీకి లభించిన మూలధన లాభాలపై విత్‌హోల్డింగ్ పన్నును ముందే తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కెయిర్న్  ఇండియాకు కూడా ఐటీ శాఖ రూ.20,495 కోట్ల డిమాండ్ నోటీసును ఇదివరకే జారీ చేసింది. ఇందులో అసలు పన్ను రూ.10,248 కోట్లు కాగా, వడ్డీ రూ.10,247 కోట్లుగా ఉంది. అయితే, ఈ పన్ను డిమాండ్ ఆదేశాలను కెయిర్న్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కాగా, రూ.14,200 కోట్ల పన్ను బకాయిలు(హచిసన్ ఎస్సార్‌లో వాటా కొనుగోలుపై లభించిన మూలధన లాభాలకు గాను) చెల్లించాలంటూ వొడాఫోన్‌కు గత నెలలోనే ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీచేయడం తెలిసిందే. భారత్‌లో పన్నులకు సంబంధించిన సరళమైన, స్థిరమైన వ్యవస్థను తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఐటీ శాఖ చర్యలు ఉన్నాయంటూ వొడాఫోన్ దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వివాదం కూడా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉంది.

>
మరిన్ని వార్తలు