మరి డిపాజిటర్ల సంగతేంటి?

9 May, 2015 01:51 IST|Sakshi
మరి డిపాజిటర్ల సంగతేంటి?

వారికి చెల్లించాల్సింది కూడా చూడాలి కదా!
సహారా కేసులో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మదుపరులకు సహారా గ్రూప్ చెల్లింపుల ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలన్న సంగతి అటుంచితే... డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన మొత్తం నిధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఈ సమస్య పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘ బెయిల్‌కు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను మేం అంగీకరిస్తాం.

సరే... మరి డిపాజిట్ దార్లకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం సంగతేంటి? ఈ ప్రతిష్టంభన కూడా పరిష్కారం కావాలని మేం కోరుకుంటున్నాం’’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవే, ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సహారా సంస్థ రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో సహా మూడు నెలల్లో చెల్లించాల్సి ఉంది. కానీ సహారా ఈ నిధులు చెల్లించలేకపోయింది. వాయిదాలు అడిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014 మార్చి నుంచీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సహారా చీఫ్, మరో ఇరువురు సహారా గ్రూప్ సంస్థల డెరైక్టర్లు తీహార్ జైలులో ఉన్నారు.

రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని, ఇందులో రూ.5,000 కోట్లు నగదుగా, మిగిలిన మొత్తం బ్యాంక్ గ్యారెంటీగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిధుల సమీకరణకు సహారా... ఆస్తుల అమ్మకం సహా పలు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవి విజయవంతం కాలేదు. అంతకుముందు సహారా గ్రూప్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తమ క్లయింట్ తరఫు వాదనలు వినిపిస్తూ... బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించటంలో భాగంగా వచ్చే వారం రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కేసు తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు