అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం

19 Oct, 2019 04:27 IST|Sakshi

ఐఎంఎఫ్‌ వృద్ధి నివేదికపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

వృద్ధి వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులకు చెప్పారు. భారత్‌ వృద్ధి రేటు ఈ ఏడాది 6.1 శాతానికే పరిమితం కావొచ్చని, 2020లో 7 శాతానికి పెరగవచ్చని ఐఎంఎఫ్‌ ఒక నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘అంచనాలు కుదించినా అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్‌ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలి. వృద్ధి రేటు మరింతగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాను‘ అని నిర్మల చెప్పారు. మరోవైపు, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశిస్తున్నాయన్నది తెలుసుకుంటున్నామని.. తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.

అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం..
వాణిజ్యపరమైన అంశాలపై అమెరికాతో నెలకొన్న విభేదాలు క్రమంగా తగ్గుతున్నాయని, త్వరలోనే ఇరు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోగలవని నిర్మల తెలిపారు. విభేదాల పరిష్కారంపై వాణిజ్య శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని, వీటిపై చర్చలు త్వరలోనే పూర్తి కాగలవని ఆమె చెప్పారు. మరోవైపు, ఇటీవలి భారత పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడేలా తమ వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ కృషి చేసినట్లు అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత పర్యటనలో వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో పాటు నిర్మలా సీతారామన్‌ తదితరులతో రాస్‌ సమావేశమయ్యారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా