నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి పెట్టాలి

17 Dec, 2019 08:37 IST|Sakshi

బ్యాంకుల ప్రక్షాళనను వేగవంతం చేయాలి

ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌  

వాషింగ్టన్‌: దేశీయంగా పడిపోయిన డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు బ్యాంకుల ప్రక్షాళన, కార్మిక సంస్కరణలు తరహా నిర్మాణాత్మక సంస్కరణలపై భారత్‌ దృష్టి సారించాలని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. దేశీయంగా మందగించిన డిమాండ్‌ను పునరుజ్జీవింపజేయడంతో పాటు, ఉత్పాదకత పెంపు ద్వారా ఉద్యోగాలను కల్పించేలా సంస్కరణలు ఉండాలన్నది తమ సూచనగా పేర్కొన్నారు. దేశ జీడీపీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి 4.5 శాతంగా నమోదు కావటం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల రెండో విడత పాలన ఆరంభంలో ఉన్నందున... సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన తరుణమని ఆమె చెప్పారు. విశ్వసనీయమైన ద్రవ్యోలోటు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.పెట్టుబడులు తగ్గిపోవడం, వినియోగ వృద్ధి నిదానించడమే వృద్ధి మందగమనానికి కారణాలని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  

వినియోగం బలహీనం...
వృద్ధి అంతంతే: భారత్‌పై మూడీస్‌

కుటుంబాల వినియోగ శక్తి బలహీనంగా ఉండడం భారత్‌ వృద్ధికి బ్రేక్‌లు వేస్తోందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. రుణ వృద్ధి, చెల్లింపులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషించింది.  2020 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాను 5.8 నుంచి 4.9 శాతానికి తగ్గించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితుల బాగోలేవని పేర్కొంది. ఉపాధి కల్పన పరిస్థితులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా