10 లక్షల శాతం పెరిగిన ఆ దేశ ద్రవ్యోల్బణం

26 Jul, 2018 17:28 IST|Sakshi
తీవ్ర సంక్షోభంలో వెనిజులా

లాటిన్‌ అమెరికా దేశం వెనిజులా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ఆకలి కేకలు ప్రపంచమంతా మారు మోగిపోతున్నాయి. పెట్రోల్‌ ఉత్పత్తులు ధరలు క్రాష్‌ కావడంతో మొదలైన సంక్షోభం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాక మరింత ఎక్కువైంది. సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో... జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణ రేటు కూడా పది శాతం, వంద శాతం, రెండొందల శాతం కాకుండా... ఏకంగా 10 లక్షల శాతం మేర పెరిగిపోతుందట. 2018లో వెనిజులా ద్రవ్యోల్బణం 10 లక్షల శాతాన్ని తాకే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. ఈ అధునాతన చరిత్రలో అత్యంత హీనాతిహీనమైన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనిజులానే అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 2014లో ఆయిల్‌ ధరలు క్రాష్‌ అవడంతో మొదలైన పతనం, అలా కొనసాగుతూనే ఉందని, వెనిజులానే కుప్పకూలేలా చేసిందని పేర్కొంది. ధరల పెంపుదలను, సౌమ్యవాద వ్యవస్థనువెనిజులా నియంత్రించలేకపోతుందని చెప్పింది. 

‘1923లో జర్మనీ, 2000లో జింబాబ్వే ఎదుర్కొన్న మాదిరిగా వెనిజులా ప్రస్తుత పరిస్థితి ఉంది. దీని ద్రవ్యోల్బణం 2018 చివరి నాటికి 10 లక్షల మేర పెరిగే అవకాశముందని అంచనావేస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పశ్చిమ అర్థగోళ విభాగపు డైరెక్టర్‌ అలెజాండ్రో వెర్నర్‌ ఏజెన్సీ బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఐఎంఎఫ్‌ అంచనాలపై వెనిజులా సమాచార మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది వినియోగదారుల ధరలు 46,305 శాతం పెరిగాయి. వాషింగ్టన్‌ మద్దతుతో వ్యతిరేక వ్యాపారులు నిర్వహించే ఆర్థిక యుద్ధానికి వెనిజులా బలైపోయిందని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పారు. అయితే దీనికంతటికీ కారణం, అధికార నాయకులు తీసుకునే చెత్త పాలసీ నిర్ణయాలేనని ప్రత్యర్థులూ విమర్శిస్తున్నారు. నగదు సరఫరా విస్తరణను పరిశీలించకపోవడం, కరెన్సీని నియంత్రించలేకపోవడం, ముడి పదార్థాలను, మెషిన్‌ పార్ట్‌లను దిగుమతి చేసుకోలేకపోవడమే దీనికి కారణమని కూడా పేర్కొంటున్నారు. 
 

మరిన్ని వార్తలు