అంచనా కంటే భారత వృద్ధి మరింత బలహీనం

14 Sep, 2019 11:20 IST|Sakshi

ఐఎంఎఫ్‌ ప్రకటన

వాషింగ్టన్‌: అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో దీర్ఘకాలం పాటు బలహీనతలే తన తాజా అంచనాలకు కారణాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. 2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2019, 2020లో భారత వృద్ధి రేటు నిదానంగా ఉంటుందని, రెండు సంవత్సరాల్లోనూ 0.3 శాతం మేర తగ్గొచ్చని ఐఎంఎఫ్‌ జూలైలో అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ బలహీనంగా ఉన్నందున 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుందని తాజా ప్రకటనలో పేర్కొంది.

అయితే భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆరి్థక వ్యవస్థేనని, చైనా కంటే ఎంతో ముందుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత్‌ తాజా ఆరి్థక వృద్ధి రేటు అంచనా వేసిన దాని కంటే మరింత బలహీనంగా ఉందని ఐఎంఎఫ్‌ అధికార ప్రతినిధి జెర్రీరైస్‌ శుక్రవారం వాషింగ్టన్‌లో మీడియాతో పేర్కొన్నారు. భారత్‌లో జూన్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటుపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ భారత్‌లో ఆరి్థక పరిస్థితిని తాము గమనిస్తున్నట్టు చెప్పారు. తయారీ రంగంలో ఉత్పాదకత పడిపోవడం, వ్యవసాయ రంగం పనితీరు క్షీణతే ఇటీవలి జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలని జాతీయ గణాంక కార్యాలయం ఇటీవలే పేర్కొన్న విషయం గమనార్హం.   

మరిన్ని వార్తలు