ఖర్చు చేస్తే ఆదా అవుతుంది

2 May, 2016 01:32 IST|Sakshi
ఖర్చు చేస్తే ఆదా అవుతుంది

కాస్త జాగ్రత్త పడితే వాహన బీమాలోనూ ఆదా
గత మూడేళ్లుగా ప్రీమియం ధరలు చూస్తే.. కారు బీమా ప్రీమియంలు 20 శాతం వరకు, ద్విచక్ర వాహనాలకైతే 15 శాతం వరకూ పెరిగాయి. అందుకే బీమా ప్రీమియం నుంచి కొంతైన ఉపశమనం పొందాలంటే కాసింత అప్రమత్తంగా... తెలివిగా వ్యవహరించాలి.

* మనం బీమా కట్టేదే వాహనానికి ఏదైనా జరిగితే క్లెయిమ్ చేయడానికే. ఇందులో మరో మాట లేదు. కాకపోతే క్లెయిమ్ చేసే ముందు కొంత ముందు చూపు అవసరం. అదేంటంటే.. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే సంబంధిత బీమా సంస్థ మరుసటి ఏడాది ప్రీమియంలో ఎంత మొత్తాన్ని తగ్గిస్తుందనేది ముందుగా తెలుసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే.. ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్న మొత్తం నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) కంటే తక్కువగా ఉందనుకోండి. మీరు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది కదా!!. అదీ మ్యాటర్.
 
* మీ కారు కనక ఐదేళ్లకు మించిందనుకోండి... నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ అనే యాడ్ కవర్‌ను తీసుకోవటం మరింత మంచిది. దీంతో క్లెయిమ్ చేసినా కూడా మీ నో క్లెయిమ్ బోనస్ మీకు తిరిగొస్తుంది. అదెలాగంటే.. మీ పాలసీపై 40 శాతం వరకు ఎన్‌సీబీ ఉందనుకుందాం. కానీ, మీరు క్లెయిమ్ చేశారనుకోండి. దీంతో వాస్తవానికి మీ ఎన్‌సీబీ మొత్తం పోవాలి. కానీ, మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉండటంతో మీ దగ్గరున్న 40 శాతం ఎన్‌సీబీలోంచి 10 శాతం పోయి మీ దగ్గర 30 శాతం ఎన్‌సీబీ అలాగే ఉండిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్ ఉంది... పెపైచ్చు క్లెయిమ్ కూడా చేయలేదనుకుందాం. ఇప్పుడేమవుతుందంటే.. మీ దగ్గరున్న ప్రొటెక్టర్ కారణంగా మీ ఎన్‌సీబీలో మరో 10 శాతం అదనంగా కలుస్తుంది. అంటే అప్పుడు మీ ఎన్‌సీబీ 50 శాతానికి చేరుతుందన్నమాట.
 
* ఒక్క ముక్కలో చెప్పాలంటే మన దగ్గర ఎంత ఎన్‌సీబీ ఉంటే ప్రీమియం అంత తగ్గుతుందన్నమాట. అయితే ఎంత తగ్గుతుందనేది మాత్రం ఏడాదిలో ఎన్నిసార్లు వాహనాన్ని క్లెయిమ్ చేశామనేదాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్న చిన్న రిపేర్లు, డ్యామేజీల వంటివి సాధ్యమైనంత వరకు క్లెయిమ్ చేయకపోవటమే మంచిది. జేబులోంచి కొంత ఖర్చు చేస్తేనే బెటర్. కారు డ్యామేజీ అయితే ముందుగా మీరు చేయాల్సిన పనేంటంటే.. కారు రిపేరుకు ఎంత ఖర్చువతుందో అంచనా వేయాలి. స్థానికంగా ఉండే రిపేరింగ్ సెంటర్లలో చేయించొచ్చేమో చూడండి. దీంతో దాదాపు 20 శాతం వరకు రిపేరింగ్ ఖర్చులు తక్కువయ్యే అవకాశముంది. రూ. 5 వేల బిల్లు అయితే మీరు బేరసారాలు ఆడి కొంతలో కొంతైన తగ్గించుకునే అవకాశముంటుంది.
 
* చాలా వెబ్‌సైట్ల ద్వారా ఏ బీమా సంస్థ ఎంత ప్రీమియం ఉందో తెలుసుకునే వీలుంది. ఆయా బీమా సంస్థల క్లెయిమ్‌ల ఆధారంగా కంపెనీ కంపెనీకి మధ్య ప్రీమియంలో తేడాలుంటాయి మరి. అందుకే ముందుగా తెలుసుకోవటం మంచిది. ఏడాది బీమా పాలసీలు కాకుండా లాంగ్ టర్మ్ పాలసీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలకు రెండు మూడేళ్ల పాలసీతో పాటూ 24ఇంటు7 రోడ్ అసిస్టెన్స్ సేవలందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. సింగిల్ ప్రీమియంలతో పోల్చుకుంటే వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. పెపైచ్చు 20-35 శాతం వరకూ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. మరోవైపు ప్రతి ఏటా పాలసీని రెన్యూవల్ చేయించాలనే టెన్షనూ ఉండదు.
 
* మీరు వాహనాన్ని విక్రయిస్తున్నప్పుడు మీ బీమా కంపెనీ నుంచి ఎన్‌సీబీ సర్టిఫికెట్‌ను తీసుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. దీనిద్వారా మీకు అప్పటిదాకా ఎంత ఎన్‌సీబీ జతపడింతో తెలుస్తుంది. వాహనాలకు యాంటీ థెఫ్ట్ డివైజ్‌ను పెట్టుకోవటం, ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి సంఘాల్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల కూడా కొంత మేర డిస్కౌంట్ పొందే అవ కాశం ఉంది.
- విజయ్‌కుమార్
చీఫ్ మోటార్ టెక్నికల్ ఆఫీసర్, బజాజ్ అలయెంజ్

మరిన్ని వార్తలు