మాల్యాను రప్పించేందుకు ముమ్మరయత్నాలు

18 Feb, 2017 04:54 IST|Sakshi
మాల్యాను రప్పించేందుకు ముమ్మరయత్నాలు

ఎంఎల్‌ఏటీ ప్రయోగానికి రంగం సిద్ధం
ఈడీకి ప్రత్యేక కోర్టు అనుమతి


ముంబై: బ్యాంకింగ్‌ బకాయిలు, అక్రమ ధనార్జన కేసుల్లో కూరుకుపోయి, బ్రిటన్‌కు తప్పించుకుపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకుగాను 1992, భారత్‌–బ్రిటన్‌ పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని (ఎంఎల్‌ఏటీ)వినియోగించుకోడానికి రంగం సిద్ధమయ్యింది. ఎంఎల్‌ఏటీ ప్రయోగానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇక్కడ ప్రత్యేక కోర్టు అనుమతిని తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఐడీబీఐకి రూ.900 కోట్ల కింగ్‌ఫిషర్‌ రుణ బకాయిలతోపాటు ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతోసహా మాల్యా, ఆయన నియంత్రణలోని కంపెనీలు రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ కేసులపై ఈడీ విచారణ జరుపుతోంది. మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి తాజాగా కోర్టు నుంచి పొందిన ‘ఎంఎల్‌ఏటీ’ ప్రయోగ ఆమోద ఉత్తర్వులను అమలు నిమిత్తం హోం శాఖకు పంపినట్లు కూడా ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. సీబీఐ కేసులను ఉదహరిస్తూ... మాల్యాను అప్పగించాలని ఇటీవలే కేంద్ర హోం మంత్రిత్వశాఖ కూడా బ్రిటన్‌కు అధికారికంగా ‘సంబంధిత ఎక్స్‌ట్రెడిషన్‌’ ఒప్పందాల కింద విజ్ఞప్తి చేసింది.

మార్చి 6న మళ్లీ వేలానికి కింగ్‌ఫిషర్‌ ఆస్తులు
బకాయిలను రాబట్టుకునే దిశగా 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ (కేఎఫ్‌ఏ) ఆస్తులను మార్చి 6న మరోసారి వేలం వేయనుంది. ముంబైలోని కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను, గోవాలోని కింగ్‌ఫిషర్‌ విల్లాను విక్రయించనుంది. గతంలో నిర్వహించిన వేలానికి స్పందన కరువవడంతో ఈసారి వీటి రిజర్వ్‌ ధరలను బ్యాంకులు మరో 10% తగ్గించింది.

మరిన్ని వార్తలు