కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఈడీ ఆరా

16 May, 2016 03:28 IST|Sakshi
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఈడీ ఆరా

వివరాలు సమర్పించాలని బ్యాంకులకు ఆదేశాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్(కే ఎఫ్‌ఏ)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ (ఈడీ) కన్నేసింది. కేఎఫ్‌ఏ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆ కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. అలాగే కేఎఫ్‌ఏకు సంబంధించిన దేశ, విదేశీ చెల్లింపుల వివరాలనూ ఇందులో సమర్పించాలని కోరింది. అంటే ఏ ఖాతా నుంచి డబ్బు వచ్చేది మరియు ఏ ఖాతాకు డబ్బు బదిలీ చేయబడేది అనే కీలక సమాచారాన్ని ఇవ్వాలని పేర్కొంది.

ఎందుకంటే ఈ సందర్భంలోనైనా మనీ ల్యాండరింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇదొక కీలక సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొంది. ఒకవేళ సంబంధిత డబ్బుకు పన్ను చెల్లించారో లేదో తెలుసుకోవటమే తమ ఉద్దేశ్యమని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకు కేఎఫ్‌ఏకు ఇచ్చిన రూ.900 కోట్ల రుణంపై ఆరా తీసింది. ఈ ప్రక్రియలో  మనీ ల్యాండరింగ్ జరిగిందన్న  అనుమానాన్ని ఈడీ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐడీబీఐతో పాటూ ఇతర బ్యాంకుల నుంచి వివరాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత నెలలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కోర్టు ఐడీబీఐ కేసులో విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.
 
సెబీ కూడా..
మరోవైపు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. యూబీ గ్రూప్‌కు చెందిన వివిధ లిస్టెడ్ కంపెనీలు, ప్రమోటర్ల ఆర్థిక వ్యవహారాలు సరిగా లేవని.. నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో దర్యాప్తును ముమ్మరం చేసింది.
 
వచ్చే నెలలో మాల్యా ప్రైవేట్ జెట్ వేలం..

విజయ్ మాల్యాకు చెందిన ప్రైవేట్ లగ్జరీ జెట్ (ఎయిర్‌బస్ ఏ319-133 సీజే) వేలం వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 12-13 తేదీల్లో జరగాల్సి ఉండగా.. ఒకే ఒక్క బిడ్డర్ మాత్రమే పోటీలో పాల్గొనడంతో వేలాన్ని వాయిదా వేసారు. కింగ్‌ఫిషర్ నుంచి రావాల్సిన రూ. 500 కోట్ల సర్వీసు ట్యాక్స్ బకాయిల కోసం మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ వచ్చే నెల 29-30 తేదీల్లో వేలాన్ని నిర్వహించనుంది. ఆసక్తి ఉన్నవారు ప్రి-బిడ్డింగ్ కింద కోటి రూపాయలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని ఎంఎస్‌టీసీ లిమిటెడ్ తెలిపింది.

మరిన్ని వార్తలు