ఏడవ నెలా ఎగుమతులు డౌన్

16 Jul, 2015 01:35 IST|Sakshi
ఏడవ నెలా ఎగుమతులు డౌన్

జూన్‌లో 16 శాతం క్షీణత
- అంతర్జాతీయ మాంద్యం, క్రూడ్ ఆయిల్ తక్కువ ధరలు కారణం
- దిగుమతులదీ క్షీణబాటే
- వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ:
ఎగుమతుల క్షీణబాట వరుసగా ఏడవనెల 2015 జూన్‌లోనూ కొనసాగింది. 2014 ఇదే నెలతో పోల్చిచూస్తే... ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 16 శాతం క్షీణించింది. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులు, క్రూడ్ ధరలు తక్కువ స్థాయి వల్ల ఈ విభాగంలో పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల విలువలు పడిపోవడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఇక దిగుమతులు కూడా క్షీణ ధోరణినే కొనసాగిస్తున్నాయి.

ఈ విలువ 2014 జూన్‌తో పోల్చితే 2015 జూన్‌లో ఈ విలువ 14 శాతం పడిపోయి 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో నెలకొన్న డిమాండ్ రాహిత్య పరిస్థితి దీనికి కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్య లోటు 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు...

- ఎగుమతులు పడిపోయిన ప్రధాన రంగాల్లో పెట్రోలియం ప్రొడక్టులు (53 శాతం), ఇంజనీరింగ్ (5.5 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (5 శాతం), రసాయనాలు (1 శాతం) ఉన్నాయి.
- చమురు దిగుమతులు 35 శాతం పడి, 8.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 2 శాతం పడి 24.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- బంగారం దిగుమతులు జూన్‌లో 37 శాతం పడిపోయాయి.
- 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
 
మూడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (2015-16, ఏప్రిల్-జూన్) ఎగుమతులు గత ఏడాది ఇదే కాలం విలువతో పోల్చితే 17% పడిపోయి 67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13% క్షీణించి 99 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్య లోటు మొదటి క్వార్టర్‌లో 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.  గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ స్థాయిలోనైనా ఎగుమతులు జరిగేనా... అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  2019-20 నాటికి 900 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్కు సాధించాలన్నది లక్ష్యం. ఈ లక్ష్య సాధన బాటలో  కేంద్రం వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో  ఎగుమతులను ప్రోత్సహించేందుకు ట్రేడ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (టీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది.
 
కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్‌ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు ఎస్‌సీ రల్‌హాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. తక్షణం ఈ పరిస్థితి కట్టడికి తీసుకోవలసిన చర్యలపై కేంద్రం సంబంధిత వర్గాల అభిప్రాయాలను సమీకరించాలని కోరారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు