కెయిర్న్‌ ఎనర్జీకి ఐటీ షాక్‌

20 Jun, 2017 00:35 IST|Sakshi
కెయిర్న్‌ ఎనర్జీకి ఐటీ షాక్‌

రూ.2,150 కోట్లు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ
వేదాంతలో ఉన్న 9.8 శాతం వాటా త్వరలో స్వాధీనం
రూ.10,247 కోట్ల పన్ను విషయంలో కఠిన చర్యలు


న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ విషయంలో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలకు దిగింది. రూ.10,247 కోట్ల రెట్రోస్పెక్టివ్‌ పన్ను విషయంలో ఇన్నాళ్లూ వేచి చూసే ధోరణి అనుసరించిన ఆదాయపన్ను శాఖ తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో దూకుడు ప్రదర్శించింది. వేదాంత లిమిటెడ్‌ నుంచి కెయిర్న్‌ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.650 కోట్ల డివిడెండ్‌ ఆదాయాన్ని జప్తు చేసింది. అలాగే, పన్ను రిఫండ్‌ రూపంలో కెయిర్న్‌ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.1,500 కోట్లను కూడా రూ.10,247 కోట్ల పన్నులో భాగంగా జమకట్టుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ట్రిబ్యునల్‌లోనూ చుక్కెదురు
కెయిర్న్‌ ఎనర్జీ తన భారతీయ విభాగమైన కెయిర్న్‌ ఇండియాలో మెజారిటీ వాటాను వేదాంత లిమిటెడ్‌కు విక్రయించగా, అనంతరం కెయిర్న్‌ ఇండియా వేదాంతలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కెయిర్న్‌ ఎనర్జీని ఎప్పటి నుంచో కోరుతోంది. దీన్ని కెయిర్న్‌ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసింది. ఇక, పన్ను వసూలులో భాగంగా భారతదేశ ఆదాయపన్ను శాఖ ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టకుండా, వేదాంత నుంచి రావాల్సిన డివిడెండ్‌ను నిలువరించకుండా చూడాలని కోరుతూ మరోసారి ఇటీవలే ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. కాగా, దీన్ని ట్రిబ్యునల్‌ తోసిపుచ్చినట్టు సమాచారం.

వెంటనే చర్యలు...
ట్రిబ్యునల్‌లో కెయిర్న్‌కు చుక్కెదురు కావడంతో ఆదాయపన్ను శాఖ వెంటనే తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కెయిర్న్‌కు చెల్లించాల్సిన డివిడెండ్‌ రూ.650 కోట్లను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలని వేదాంత లిమిటెడ్‌ను ఆదేశిస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్‌226(3) కింద ఈ నెల 16న నోటీసు జారీ చేసింది. వేదాంతలో కెయిర్న్‌కు 9.8 శాతం వాటా ఉంది. ఈ వాటా కింద గత రెండు సంవత్సరాలుగా చెల్లించాల్సిన డివిడెండ్‌ను పన్ను వివాదం నేపథ్యంలో వేదాంత లిమిటెడ్‌ నిలిపి ఉంచింది. ఇక వేదాంతలో కెయిర్న్‌కు ఉన్న వాటాను సైతం ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకోనుంది. చట్ట ప్రకారం పన్ను వసూలుకు అసెసింగ్‌ అధికారి సర్టిఫికెట్‌ను రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా కెయిర్న్‌కు వేదాంతలో ఉన్న వాటాను స్వాధీనం చేసుకుని విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్‌ఐసీ లేదా వేదాంత లిమిటెడ్‌ ఈ రెండు సంస్థల్లో రేటు ఎక్కువ కోట్‌ చేసిన వారికి వాటాను విక్రయించే అవకాశమున్నట్టు వెల్లడించాయి.

న్యాయపోరాటం కొనసాగిస్తాం: కెయిర్న్‌
ఆదాయపన్ను శాఖ తాజా చర్యలను కెయిర్న్‌ ఎనర్జీ ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో రెట్రోస్పెక్టివ్‌ పన్ను విషయంలో తన పోరాటం కొనసాగిస్తామని, కేసుపై తమకు విశ్వాసం ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు