జనాభా 130 కోట్లు పన్ను కట్టింది 1.46 కోట్లు

15 Feb, 2020 08:24 IST|Sakshi

కానీ ఏటా విదేశాలకు వెళుతున్న 3 కోట్ల మంది

రూ.5 కోట్ల ఆదాయం దాటింది 8,600 మంది మాత్రమే...

వారిలో రూ.కోటి దాటిన ప్రొఫెషనల్స్‌ 2,200

మొత్తం రిటర్నులు వేసిన వారి సంఖ్య 5.78 కోట్లు

2018–19 ఆదాయ పన్ను రిటర్నుల్లో ఎన్నెన్ని చిత్రాలో...

సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల పేరుతో విదేశాలను చుట్టివచ్చారు. కానీ మన దేశంలో ఆదాయం పన్ను కడుతున్న వారెంతమందో తెలుసా? 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.46 కోట్ల మంది ఆదాయ పన్ను కట్టినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ప్రకటించింది. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసింది 5.78 కోట్ల మందే. అంతేకాదు లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు వంటి వృత్తినిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నా... వీరిలో సంవత్సరానికి రూ.కోటి ఆదాయం దాటిన వారు మాత్రం 2,200 మందే!!. నిజానికి ఈ సమాచారం చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ముక్కున వేలేసుకున్నారు!!. దీనిపై ఆయన ఘాటుగానే స్పందించారు. కోటి రూపాయల ఆదాయం దాటిన వృత్తినిపుణుల సంఖ్య కేవలం 2,200 ఉందంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ గణాంకాలు ఎంత మంది పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారన్నది స్పష్టం చేస్తున్నాయని, దేశాభివృద్ధికి అందరూ పన్నులు చెల్లించాలని కోరారాయన. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇవీ...

(ఆదాయం రూ.కోట్లలో)
5 కోట్ల ఆదాయం దాటిన వారు: 8,600
50 లక్షల ఆదాయం దాటినవారు: 3,16,000
10 లక్షల పైన ఆదాయం చూపిన వారు: 46 లక్షలు
5–10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు: కోటి మంది
2.50 లక్షలు– 5 లక్షల మధ్య ఉన్న వారు: 3.29 కోట్లు
2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు: 1.03 కోట్లు
మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారు: 5.78 కోట్లు
రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు కనక 4.32 కోట్ల మంది ఎలాంటి పన్నూ కట్టలేదు
నికరంగా పన్ను చెల్లించిన వారు: 1.46 కోట్లు... దాదాపుగా 1%.

మరిన్ని వార్తలు