ఫెడ్.. లబ్‌డబ్!

14 Sep, 2015 02:13 IST|Sakshi
ఫెడ్.. లబ్‌డబ్!

- అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం గణాంకాలతో ట్రెండ్
ముంబై:
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయం, కీలకమైన ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. అయితే మార్కెట్లో తుఫాను చెలరేగే ముందు, కాస్త ప్రశాంతత నెలకొంటుందని వారన్నారు.

గత వారాంతంలో విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకంటే మించినందున, ఈ సోమవారం మార్కెట్ పాజిటివ్‌గా మొద లుకావొచ్చని వారు అంచనావేశారు. జూలై పారిశ్రామికోత్పత్తి 4.2 శాతం వృద్ధి చెందినట్లు (అంచనా వృద్ధి 3.6 శాతం) గత శుక్రవారం నాటి డేటా వెల్లడించిందని, దీంతో మార్కెట్ సోమవారం సానుకూలంగా వుండవచ్చని ఏంజిల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ వైభవ్ అగర్వాల్ అన్నారు. అదే రోజున వెలువడే రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి మార్కెట్ దిశను నిర్దేశించవచ్చన్నారు. సెప్టెంబర్ 29వ తేదీనాటి రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఈ ద్రవ్యోల్బణం డేటాను పరిగణనలోకి తీసుకుంటారని  జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ టెక్నికల్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు.
 
సెప్టెంబర్ 17 వైపు చూపు...
దేశీయంగా వెలువడిన పారిశ్రామికోత్పత్తి డేటా, వెల్లడికాబోయే ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ను ఉత్సాహపర్చినా, ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ కమిటీ ఈ నెల 16-17 తేదీల్లో జరపబోయే సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలను ఒడుదుడుకులకు లోనుచేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తానికి ముఖ్యమైన తేదీ సెప్టెంబర్ 17 అని, అదే రోజున ఫెడ్ వడ్డీ రేట్లు పెంచేదీ, లేనిదీ తెలుస్తుందని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనిద్య బెనర్జీ చెప్పారు.

ప్రధానంగా ఆ రోజున ఫెడ్ చేసే ప్రకటన, ఆ ప్రకటనలో ఉపయోగించే పదజాలం కీలకమని, వడ్డీ రేట్లపై సుతిమెత్తని వ్యాఖ్యానాలుంటే మార్కెట్లు వేగంగా కోలుకుంటాయని, పదజాలం పరుషంగా వుంటే డిసెంబర్‌లో వడ్డీరేట్లు పెరగవచ్చని, తద్వారా మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడుతుందని ఆయన వివరించారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా భారత్‌తో సహా ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వైదొలుగుతారని తాము అంచనావేస్తున్నామన్నారు. ఫెడ్ నిర్ణయం వెలువడే సెప్టెంబర్ 17న వినాయక చతుర్థి అయినందున, ఆ రోజున భారత్‌లో మార్కెట్లకు సెలవు.
 
గతవారం మార్కెట్...
ప్రపంచ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 408 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 134 పాయింట్లు ర్యాలీ జరిపింది.
 
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూ. 7000 కోట్లు
ఈ నెలలో ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో భారీఎత్తున రూ. 17,428 కోట్ల నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), ఈ నెలలోనే అదేతరహాలో అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 1-11 తేదీల మధ్య రూ. 6,109 కోట్లు ఈక్విటీ మార్కెట్‌లోనూ, రూ. 773 కోట్లు డెట్ మార్కెట్‌లోనూ వారు నికరంగా విక్రయించినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.

>
మరిన్ని వార్తలు