ఏప్రిల్‌లో భారీగా పెరిగిన  పసిడి దిగుమతులు 

21 May, 2019 00:04 IST|Sakshi

54 శాతం వృద్ధితో 3.97 బిలియన్‌ డాలర్లుగా నమోదు  

న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా పెరిగాయి. 2018 ఏప్రిల్‌ దిగుమతుల పరిమాణం 2.58 బిలియన్‌ డాలర్లతో పోల్చితే 2019 ఏప్రిల్‌లో 54 శాతం వృద్ధితో 3.97 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.  అయితే ఈ పరిణామం కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి ఒక నిర్ధిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకం మధ్య ఉండే నికర వ్యత్యాసం)పై ప్రభావం చూపడం గమనార్హం. ఏప్రిల్‌లో క్యాడ్‌  విలువ 15.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. 2018–19 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌)  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో పోల్చితే కరెంట్‌ అకౌంట్‌ లోటు 2.5 శాతంగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు 2.1 శాతమే కావడం గమనార్హం. భారత్‌ వార్షికంగా దాదాపు 800 నుంచి 900 టన్నుల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంటోంది.    

మరిన్ని వార్తలు