మరింత పెరిగిన సిండికేట్‌ బ్యాంకు నష్టాలు

7 Aug, 2018 01:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సిండికేట్‌ బ్యాంకు నష్టాలు జూన్‌ త్రైమాసికంలో మరింత విస్తృతం అయ్యాయి. రూ.1,282 కోట్ల నష్టాన్ని బ్యాంకు ఈ కాలంలో చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.263 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం రూ.5,637 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,171 కోట్లు. వడ్డీ ఆదాయం రూ.5,484 కోట్ల నుంచి రూ.5,257 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, ఆర్‌బీఐ వద్ద, ఇతర ఇంటర్‌ బ్యాంకు వేదికల వద్దనున్న నిధులపై వడ్డీ ఆదాయంలోనూ గణనీయమైన తగ్గుదల ఉంది.

ఆస్తుల నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది జూన్‌ నాటికి 12.59 శాతానికి (రూ.26,361 కోట్లు) పెరిగిపోయాయి. గతేడాది ఇదే కాలం నాటికి 9.96% (రూ.20,183 కోట్లు) ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలోనూ 11.53 శాతంగానే ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 6.27% (రూ.12,188 కోట్లు) నుంచి 6.64%(రూ.13,010 కోట్లు)కి పెరిగాయి. ఎన్‌పీఏలు పెరగడంతో వీటి కోసం బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో రూ.1,774 కోట్లు పక్కన పెట్టడం నష్టాలకు దారితీసింది. 

మరిన్ని వార్తలు