తలకు మించిన ఖర్చు..

17 Mar, 2018 02:40 IST|Sakshi

హెయిర్‌ కేర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత

దేశీయంగా ఏటా రూ.19,000 కోట్ల ఖర్చు

ఫార్మా, ఆయుర్వేదం సహా 100కు పైగా కంపెనీలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొప్పున్నవాళ్లు ఏ ముడి వేసినా అందమేనంటారు. అంటే... ఏ స్టయిల్‌ చెయ్యడానికైనా ముందు జుట్టుండాలి కదా!! బహుశా... అందుకేనేమో!! భారతీయులు తల వెంట్రుకల సంరక్షణకు (హెయిర్‌ కేర్‌) ఏటా ఏకంగా రూ.19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. సౌందర్య పోషణ (పర్సనల్‌ కేర్‌) ఉత్పత్తుల్లో హెయిర్‌ కేర్‌ వాటా అధికమనేది మార్కెట్‌ వర్గాల మాట. ఈ ప్రాధాన్యాన్ని చూసే... ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతోపాటు ఎఫ్‌ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి.

నిజానికిపుడు జుట్టు రాలిపోవడం, పలుచబారడం, కొత్త వెంట్రుకలు రాకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. దీనికి సమతుల ఆహార లేమి, ఒత్తిడి, లైఫ్‌స్టైల్, హార్మోన్ల అసమతౌల్యం, వాతావరణ కాలుష్యం వంటి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్లే అధిక సమస్యలు వస్తున్నాయన్నది ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ రజిత దామిశెట్టి మాట. దేశంలో ఐదుగురు మహిళల్లో ఒకరు కేశ సంబంధ  సమస్యతో బాధపడుతున్నారని ఆమె చెప్పగా... పురుషుల్లో 11 శాతం మంది బాధితులున్నట్లు ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్‌ తెలియజేసింది.

ఇదీ...హెయిర్‌ కేర్‌ మార్కెట్‌..
తల వెంట్రుకల సంరక్షణకు భారతీయులు ఏటా రూ.19,000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక సాధారణ హెయిర్‌ ఆయిల్స్, షాంపూలు, క్రీమ్స్, జెల్స్‌ కోసం చేసే వ్యయం దీనికి అదనం. భారత్‌లో 100కుపైగా ప్రముఖ కంపెనీలు ఈ మార్కెట్లో పోటీపడుతున్నాయి.‘‘కేశ సంరక్షణపై ప్రజల్లో అవగాహన రావడం, మధ్యతరగతి ప్రజలు అధికమవడం కూడా ఈ మార్కెట్‌ పెరుగుదలకు దోహదం చేస్తోంది’’ అని గ్లెన్‌మార్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) రాజేశ్‌ కపూర్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కేశ సంరక్షణకు వైద్యులు సిఫార్సు చేసిన మందులు, చికిత్సలకు భారతీయులు ఏటా కనీసం రూ.600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారాయన.  

డ్రాప్‌ అయ్యేవారే ఎక్కువ..
కేశ సమస్యల పరిష్కారానికి కనీసం 6–8 నెలల పాటు సంరక్షణ ఉత్పత్తులు వాడాల్సి ఉందని రాజేశ్‌ కపూర్‌ వెల్లడించారు. ‘విద్య, డిజిటల్‌ మాధ్యమాలు, టీవీల కారణంగా అందంగా కనపడాలన్న తపన అందరిలోనూ వచ్చింది. అయితే చికిత్సను ఉత్సాహంగా మొదలు పెట్టినా.. మధ్యలోనే మానేసేవారే ఎక్కువ. వాస్తవానికి కేశ సంరక్షణ విషయంలో భారత్‌లో సరైన ఉత్పత్తులు తక్కువే ఉన్నాయి. 20 ఏళ్ల ట్రాక్‌ రికార్డును గమనించే 50 దేశాల్లో విజయవంతంగా అమ్ముడవుతున్న నూర్‌క్రిన్‌ ట్యాబ్లెట్లను మహిళల కోసం భారత్‌లో ప్రవేశపెట్టాం’ అని వివరించారు.

>
మరిన్ని వార్తలు