ఆసియా ఇన్‌ఫ్రా బ్యాంక్ ఆవిర్భావం

25 Oct, 2014 00:19 IST|Sakshi
ఆసియా ఇన్‌ఫ్రా బ్యాంక్ ఆవిర్భావం

ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల పెత్తనానికి చెక్..!
* బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు; వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు
* భారత్, చైనాతో పాటు మరో 19 దేశాలకు సభ్యత్వం...
* అవగాహన ఒప్పందంపై సంతకాలు
* అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు...

బీజింగ్: అమెరికా, ఇతరత్రా పశ్చిమ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పెత్తనానికి చెక్ చెప్పేవిధంగా ఆసియాలో కొత్త బ్యాంకు ఆవిర్భవించింది. ఈ ప్రాంతంలోని దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులందించే లక్ష్యంతో ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) శుక్రవారం ఏర్పాటైంది. చైనా నేతృత్వంలో బీజింగ్ కేంద్రంగా నెలకొల్పనున్న ఏఐఐబీ కోసం అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)పై చైనా, భారత్‌తో పాటు మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా... వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కూడా దీని ప్రధానోద్దేశంగా భావిస్తున్నారు. ఇక్కడి ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐఐబీ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. భారత్ తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ ఉషా టైటస్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.
 
విధివిధానాలు త్వరలో ఖరారు...
ఏఐఐబీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.6.1 లక్షల కోట్లు) అధీకృత మూలధనంతో ఇది ఏర్పాటవుతుందని ఎంఓయూలో పేర్కొన్నారు. ప్రాథమిక వినియోగ మూలధనం 50 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. చైనా ఆర్థిక శాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఏఐఐబీకి తొలి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన గతంలో పనిచేశారు. సభ్య దేశాలతో సంప్రదింపుల తర్వాత ఓటింగ్ హక్కులు, ఇతర ప్రామాణిక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీడీజీ, ప్రజల కొనుగోలు శక్తి(పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీ) ఆధారంగా వీటిని ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం చూస్తే భారత్‌కు ఏఐఐబీలో చైనా తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు కానుంది.

ఈ కొత్త బ్యాంకు కారణంగా ఆసియా ప్రాంతంలోని దేశాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల లభ్యత పెరగనుందని ఉషా టైటస్ పేర్కొన్నారు. ఇటీవల బ్రెజిల్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని మోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏఐఐబీలో సభ్యత్వానికి ఇండిమాను ఆహ్వానించారు. భారత్, చైనాలతో పాటు ఏఐఐబీలో వియత్నాం, ఉజ్జెకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, సింగపూర్, ఖతార్, ఒమన్, ఫిలిప్పైన్స్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, బ్రూనై, కంబోడియా, కజకిస్థాన్, కువైట్, లావో పీడీఆర్, మలేసియా, మంగోలియా, మయన్మార్‌లు వ్యవస్థాపక సభ్య దేశాలుగా చేరాయి. అయితే, ఏడీబీలో ప్రధాన భూమిక పోషిస్తున్న జపాన్‌తో పాటు దక్షిణకొరియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియాలు కూడా ఏఐఐబీకి దూరంగా ఉన్నాయి. ప్రధానంగా అమెరికా ఒత్తిడే దీనికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు.
 
కార్పొరేట్లు హర్షం...
ఏఐఐబీలో భారత్ సభ్యదేశంగా చేరడాన్ని భారత కార్పొరేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల మౌలిక సదుపాయాలకు, నిధుల కొరతకు కొంత పరిష్కారం లభిస్తుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ఆసియాలో మౌలిక సదుపాయాల కోసం వచ్చే పదేళ్లలో సుమారు 8 ట్రిలియన్ డాలర్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. ఒక్క భారత్‌కే ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.61 లక్షల కోట్లు)  అవసరమని భావిస్తున్నారు.
 
బ్రిక్స్ బ్యాంకుకు అదనంగా...

వర్ధమాన దిగ్గజ దేశాల కూటమి బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మౌలిక నిధుల కల్పన కోసం బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చైనాలోని షాంఘై కేంద్రంగానే ఏర్పాటు కానుంది. దీని మొదటి అధ్యక్ష పదవి కూడా భారత్‌కే లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు పోటీగానే బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇప్పటికే పశ్చిమ దేశాల్లో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏఐఐబీ ఆవిర్భావం జరగడం విశేషం. కాగా, ఎంఓయూపై సంతకాల అనంతరం సభ్య దేశాల ప్రతినిధులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఏఐఐబీ ఏర్పాటును అత్యంత కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు.  ‘సంపన్నులు కావాలంటే మంచి ‘రహదారులు’ నిర్మించుకోవాలన్నది చైనాలో సామెత.

ఇప్పుడు ఏఐఐబీ ఏర్పాటు వెనుక ప్రధానోద్దేశం కూడా ఇదే. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు పరుగులు తీయాలన్న సంకల్పంతోనే ఈ బ్యాంకును నెలకొల్పుతున్నాం’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఒక్క ఆసియా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలను కూడా దీనిలో భాగస్వామ్యానికి ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడీబీ తదితర బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి నిర్వహణ నైపుణ్యాలు, అనుభవాలను ఏఐఐబీకి వినియోగించుకుంటామన్నారు. కాగా, ఈ కొత్త బ్యాంకుతో తమకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావో బీజింగ్‌లో వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు