భారత్‌ అద్భుతమైన వేగంతో ఉంది

7 May, 2018 09:39 IST|Sakshi

మనీలా : దేశీయ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పైగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ వృద్ధిరేటు అద్భుతమైన వేగంగా ఉందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) అభివర్ణించింది. ఇదే స్థాయిలో దూసుకుపోతే, దశాబ్దంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండింతలు కానుందని ఏడీబీ చీఫ్‌ ఎకనామిస్ట్‌ యసుయుకి సవాడా అన్నారు. 8 శాతం వృద్ధి రేటు సాధించలేదని భారత్‌ ఆందోళన చెందాల్సినవసరం లేదని, కానీ ఆదాయ అసమానతలు తగ్గించి, దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాలని సూచించారు. వృద్ధి రేటు ఎగుమతులు కంటే దేశీయ వినియోగంపైనే ఎక్కువగా వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. 

2018-19లో 7.3 శాతం వృద్ధి రేటుతో ఆసియా దేశాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంటుందని ఏడీబీ పేర్కొంది. ఈ వృద్ధి రేటు 2019-20 కల్లా 7.6 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనా వేసింది. 7 శాతమనేది నిజంగా చాలా వేగవంతమైనదని, ఒకవేళ 10 ఏళ్లు కూడా 7 శాతం వృద్ధిరేటునే కొనసాగిస్తే, దేశీయ ఆర్థికవ్యవస్థ పరిమాణం రెండింతలవుతుందని సవాడా పేర్కొన్నారు. ఇది చాలా వేగవంతంగా దూసుకుపోతున్న వృద్ధి రేటు, ఈ రీజియన్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇదీ ఒకటని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటు సాధించి, వచ్చే ఏడాదిలో 7.6 శాతాన్ని తాకుతుందని, ఇది నిజంగా అద్భుతమైన వేగమేనని ప్రశంసలు కురిపించారు. 

ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. 8 శాతం వృద్ధి రేటు అనేది భారత్‌కు అతిపెద్ద సవాల్‌ అని సవాడా పేర్కొన్నారు. 7 శాతం వృద్ధి అనేది చాలా మంచి నెంబర్‌, 8 శాతం సాధించలేదని భారత్‌ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎగుమతులు భారత వృద్ధిని నిర్థారించవని, దేశీయ మార్కెటే వృద్ధి రేటుకు చాలా కీలకమని పేర్కొన్నారు. ఎగుమతులు వృద్ధిని పెంచడంలో ఒక భాగమే మాత్రమే కానీ ఎక్కువగా దేశీయ మార్కెటే కీలకమైనదని తెలిపారు. ఆదాయ అసమానతలు, పేదరికం తగ్గింపు ఎక్కువ వృద్ధి రేటు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.   
 

మరిన్ని వార్తలు