పరిశోధనలకు అడ్డా... భారత్‌!!

15 Feb, 2019 00:53 IST|Sakshi

మనవైపు ఆసియా కంపెనీల చూపు..

ఏడాది కాలంలో 9 ఆర్‌అండ్‌డీ కేంద్రాలు

ఐవోటీ, డేటా అనలిటిక్స్‌ తదితర అధునాతన సాంకేతికతకు ప్రాధాన్యం

భారీగా నిపుణుల లభ్యత,క్కువ ఉత్పాదక వ్యయాలే కారణం  

కొత్త ఉత్పత్తులు, సేవలకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలకు కేంద్రంగా భారత్‌ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు అమెరికా, యూరప్‌ కంపెనీలు ఇక్కడ తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోగా.. తాజాగా ఆసియా కంపెనీలు కూడా భారత్‌వైపు చూస్తున్నాయి. ఏడాది వ్యవధిలో జపాన్, సింగపూర్‌ వంటి ఆసియా దేశాలకు చెందిన తొమ్మిది దిగ్గజ సంస్థలు భారత్‌లో క్యాప్టివ్‌ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించాయి. ఈ సంస్థలు ఎక్కువగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటా అనలిటిక్స్‌ వంటి అధునాతన సాంకేతిక అంశాల్లో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. భారత్‌లో నిపుణుల లభ్యత పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి మెరుగైన స్టార్టప్‌ వ్యవస్థ, తక్కువ వ్యయాలు మొదలైనవి ఆయా సంస్థలను ఆకర్షిస్తున్నాయి.భారతీయ టాలెంట్‌ను ఉపయోగించుకుని అమెరికన్, యూరోపియన్‌ దేశాల సంస్థలు వృద్ధి చెందుతున్న విషయాన్ని ఆసియన్‌ కంపెనీలు క్రమంగా గుర్తిస్తున్నాయని, అందుకే భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా.. భారత్‌ వంటి భారీ మార్కెట్లో పట్టు సాధించేందుకు స్థానికంగా తమ కార్యకలాపాలు ఉండటం మంచిదనే ఉద్దేశంలో అవి ఉన్నట్లు వివరించాయి. 

దేశీయంగా వెయ్యికి పైగా జీఐసీలు.. 
ఈ ఆర్‌అండ్‌డీ కేంద్రాలను గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్లుగా (జీఐసీ) కూడా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం భారత్‌లో దాదాపు 1,257 జీఐసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 976 సెంటర్లు పూర్తిగా ఆర్‌అండ్‌డీకి మాత్రమే పరిమితమైనవి ఉన్నాయి. ఈ జీఐసీల్లో సింహభాగం అమెరికా, కెనడా కంపెనీలవే కావడం గమనార్హం. మొత్తం జీఐసీల్లో 65 శాతం వాటా ఈ దేశాల సంస్థలదే కాగా.. యూరోపియన్‌ దేశాల కంపెనీలు ఆ తర్వాతి  స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం జీఐసీల్లో ఆసియన్‌ కంపెనీల వాటా 7 శాతం మాత్రమే ఉందని, అయితే గడిచిన మూడు–నాలుగేళ్లుగా భారత్‌లో తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆసియన్‌ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని కన్సల్టెన్సీ సంస్థ జిన్నోవ్‌ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌కి చెందిన ఈ–కామర్స్‌ కంపెనీ రెడ్‌మార్ట్, గోజెట్‌ ఎయిర్‌లైన్స్, డీబీఎస్‌ బ్యాంక్‌ మొదలైనవి ఇటీవలి కాలంలో భారత్‌లో తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నాయి. అటు చైనా స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ దిగ్గజం ఒప్పో భారత్‌లో జీఐసీ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించగా.. మరో స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఇటీవలే హైదరాబాద్‌లో తమ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ప్రారంభించింది. సాఫ్ట్‌వేర్‌ తదితర విభాగాలకు సంబంధించి భారత్‌లో పరిశోధన,అభివృద్ధి కార్యకలాపాల విస్తరణకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని, తమ హైదరాబాద్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోబోతున్నామని వన్‌ప్లస్‌ సీఈవో పీట్‌ లౌ చెప్పారు కూడా. 

ముప్పై పైగా జపాన్‌ సంస్థలు.. 
జపాన్‌కి చెందిన ముప్ఫై సంస్థలకు ఇప్పటికే భారత్‌లో ఆర్‌అండీ కేంద్రాలున్నాయి. అలాగే దక్షిణ కొరియా దిగ్గజాలు శాంసంగ్, మొబిస్‌ వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కొత్తగా జపాన్‌కి చెందిన ఇంటర్నెట్‌ సంస్థ రకుటెన్, నిస్సాన్‌ మోటార్‌ వంటివి ఈ జాబితాలో చేరాయి. డ్రైవర్‌ రహిత కార్లపై ఆర్‌అండ్‌డీ కోసం తిరువనంతపురంలో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని నిస్సాన్‌ ఇటీవల తెలిపింది.2019 మార్చి నాటికి 550 మంది టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, రకుటెన్‌... తమ టెక్నాలజీ రీసెర్చ్‌లో సింహభాగం కార్యకలాపాలను భారత్‌ నుంచి నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో భారత్‌లో సిబ్బంది సంఖ్యను 900 పైచిలుకు స్థాయికి పెంచుకోవాలని యోచిస్తోంది. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించేందుకు ఇక్కడి స్టార్టప్‌ సంస్థలతో జట్టు కట్టడంపై పలు ఆసియన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, కుదిరితే స్టార్టప్స్‌ను కొనుగోలు చేయాలని కూడా భావిస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు