మార్చి 16 నుంచి హైదరాబాద్‌లో ఏవియేషన్ సదస్సు

9 Dec, 2015 00:51 IST|Sakshi
ఎయిర్ బస్ లోపలి భాగం

కనువిందు చేయనున్న ఎయిర్‌బస్ ఏ350
 వేదికవుతున్న బేగంపేట విమానాశ్రయం
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
వైమానిక ప్రదర్శనకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది. 2016 మార్చి 16-20 తేదీల్లో ఇండియా ఏవియేషన్-2016 అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు జరుగనుంది. రెండేళ్లకోసారి బేగంపేటలో ఈ ఈవెంట్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఫిక్కీ సహకారంతో పౌర విమానయాన శాఖ దీనిని నిర్వహిస్తోంది. భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 250కిపైగా కంపెనీలు ఇక్కడ తమ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర ఉపకరణాలు, సేవలను ప్రదర్శించనున్నాయి. బోయింగ్, బాంబార్డియర్, ఎయిర్‌బస్, డస్సాల్డ్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్, హనీవెల్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎంబ్రాయర్, గల్ఫ్‌స్ట్రీమ్, రోల్స్ రాయ్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్ ఇండియా, పవన్ హన్స్ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయి.

ఎయిర్‌బస్ నూతన మోడల్ ఏ350 విమానం ప్రత్యేక ఆకర ్షణగా నిలవనుంది. భారత్‌కు ఇది తొలిసారిగా అడుగు పెడుతోంది.
 ఇవీ ఏ350 విశేషాలు..
 విమానం ధర మోడల్‌నుబట్టి రూ.1,800-2,300 కోట్ల వరకు ఉంది. వేరియంట్‌నుబట్టి 440 మంది వరకు కూర్చునే వీలుంది. వేగం గంటకు 940 కిలోమీటర్లు. ఒకేసారి 15,200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పొడవు 60.54 నుంచి 73.78 మీటర్లు. ఎత్తు 17 మీటర్లు. 64.75 మీటర్లమేర రెక్కలు విస్తరించాయి. బిజినెస్ క్లాస్‌లో 16 అంగుళాల సైజు స్క్రీన్స్‌ను పొందుపరిచారు. ఎయిర్‌బస్ తొలిసారిగా ప్రధాన బాడీతోపాటు రెక్కలను కార్బన్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ పాలిమర్‌తో తయారు చేసింది. గట్టిదనంతోపాటు తేలికగా ఉండడం ఈ మెటీరియల్ ప్రత్యేకత. చాలా ఖరీదైనది కూడాను. 25 శాతం అధిక మైలేజీ ఇస్తుంది. ఎయిర్‌బస్ ఇప్పటి వరకు ఏ350 మోడల్‌లో నాలుగు వేరియంట్లకుగాను 775 విమానాలకు ఆర్డర్లుంటే, 11 మాత్రమే డెలివరీ చేసింది. ప్రస్తుతం ఖతర్ ఎయిర్‌వేస్, వియత్నాం ఎయిర్‌లైన్స్, ఫిన్‌ఎయిర్ మాత్రమే వీటిని దక్కించుకున్నాయి.
 

మరిన్ని వార్తలు