ఐరిస్‌తో ఏటీఎం లావాదేవీలు 

16 Aug, 2018 00:46 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చిన యాక్సిస్‌ బ్యాంక్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైక్రో ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీ జరిపేందుకు ధ్రువీకరణ కోసం ఇప్పటి వరకు వేలి ముద్రను వాడేవారు. భారత్‌లో తొలిసారిగా యాక్సిస్‌ బ్యాంకు ఐరిస్‌ ధ్రువీకరణను పరిచయం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ టెక్నాలజీని విజయవంతంగా నిర్వహిస్తోంది. యాక్సిస్‌ బ్యాంకు త్వరలో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. వేలిముద్రలు సరిగా పడక లావాదేవీలు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇటువంటి సమస్యలకు ఈ టెక్నాలజీ చెక్‌ పెట్టనుంది. ప్రస్తుతం పైలట్‌ కింద 100కుపైగా ఐరిస్‌ ఆధారిత మైక్రో ఏటీఎంలను వినియోగిస్తున్నామని యాక్సిస్‌ బ్యాంకు రిటైల్‌ విభాగం ఈడీ రాజీవ్‌ ఆనంద్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ టెక్నాలజీని పరిచయం చేస్తామని చెప్పారు.  

ఈ ఏడాది 400 శాఖలు.. 
యాక్సిస్‌ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3,800ల శాఖలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 350–400 బ్రాంచీలను తెరువనున్నట్టు రాజీవ్‌ ఆనంద్‌ వెల్లడించారు. ‘ఏప్రిల్‌–జూన్‌లో దేశంలో నూతనంగా 76 కేంద్రాలను ప్రారంభించాం. తెలంగాణలో ఇప్పుడు 123 శాఖలున్నాయి. మార్చికల్లా మరో 17 రానున్నాయి. ఇక మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు తొలి త్రైమాసికంలో రూ.71,444 కోట్లు నమోదు చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 90 శాతం అధికం. డిజిటల్‌ లావాదేవీల వాటా 70 శాతంగా ఉంది. ఆటోమేషన్‌ కారణంగా వచ్చే 3–5 ఏళ్లలో బ్రాంచీల విస్తీర్ణం తగ్గుతుంది’ అని వివరించారు. 

మరిన్ని వార్తలు