విదేశీ సంస్థలకు మరింత ఆకర్షణీయంగా భారత్‌..

12 Jul, 2017 01:09 IST|Sakshi
విదేశీ సంస్థలకు మరింత ఆకర్షణీయంగా భారత్‌..

కానీ సంస్కరణల అమల్లో సవాళ్లు తప్పవు..
చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం


బీజింగ్‌:  భారత్‌ విదేశీ సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్‌ టైమ్స్‌ దినపత్రిక వ్యాఖ్యానించింది. అయితే, జీఎస్‌టీ తదితర సంస్కరణల అమలు అంత సులభతరం కాకపోవచ్చని ఒక వార్తాకథనంలో పేర్కొంది. ‘చౌక తయారీ కార్యకలాపాలు క్రమంగా చైనా నుంచి తరలిపోతున్న తరుణంలో ’ప్రపంచ ఫ్యాక్టరీ’గా చైనా స్థానాన్ని దక్కించుకోగలదా లేదా అన్నది భారత్‌కు, మిగతా ప్రపంచానికి చాలా కీలకంగా మారింది‘ అని గ్లోబల్‌ టైమ్స్‌ సదరు ఆర్టికల్‌లో పేర్కొంది. మౌలిక సదుపాయాల కొరత, రాష్ట్రాల స్థాయిలో పాలసీల అమల్లో సవాళ్లు మొదలైనవి ఉన్నప్పటికీ.. దేశ మార్కెట్‌ను ఏకం చేసే దిశగా భారత ప్రభుత్వం దూకుడుగా ప్రవేశపెడుతున్న సంస్కరణలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వివరించింది.

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమలు దరిమిలా ఫాక్స్‌కాన్, మిడియా మొదలైన సంస్థలు ఇన్వెస్ట్‌ చేస్తుండటం దీనికి నిదర్శనమని పేర్కొంది. కొత్త పన్నుల విధానం.. మేకిన్‌ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఉందని, తయారీలో భారత్‌ పోటీతత్వాన్ని పెంచే విధంగా ఉందని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. అయితే, లక్ష్యాన్ని సాధించడం భారత్‌కి అంత సులువు కాబోదని పేర్కొంది. 29 రాష్ట్రాల్లో నియంత్రణపరమైన, ప్రభుత్వ యంత్రాంగంపరమైన సవాళ్ల కారణంగా సంస్కరణ చర్యల అమలు అంత సులభతరంగా కాబోదని స్పష్టం చేసింది. ఇక కార్మిక శక్తి చౌకగా లభించినా.. మౌలిక సదుపాయాల కొరత, సంస్కృతిపరమైన వైరుధ్యాలు మొదలైనవి భారత్‌కి ప్రతికూలాంశాలని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు