భారత బిలీనియర్స్‌ అంతకంతకు పైపైకే....

23 May, 2018 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌... ప్రస్తుతం అత్యధిక బిలీనియర్స్‌ ఉన్న జాబితాలో ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తోంది. వచ్చే దశాబ్దంలో ఈ బిలీనియర్స్‌ సంఖ్యను భారత్‌ మరింత పెంచుకోనుందట. తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్న రిపోర్టుల ప్రకారం భారత్‌ తన బిలీనియర్ల జాబితాలో అదనంగా 238 మంది చోటు దక్కించుకోబోతున్నట్టు వెల్లడైంది.

ఆఫ్రాఆసియా బ్యాంకు గ్లోబల్‌ హెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 119 మంది బిలీనియర్లు ఉన్నారని, ఈ సంఖ్య 2027 నాటికి 357కు ఎగియనుందని తెలిసింది. వచ్చే 10 ఏళ్లలో భారత్‌ అదనంగా 238 మంది బిలీనియర్లను సృష్టిస్తుందని, చైనా 448 మందిని బిలీనియర్ల జాబితాలో చేర్చుకుంటుందని ఈ రివ్యూ అంచనావేస్తోంది.  

ప్రస్తుతం అమెరికా 62,584 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశంగా ఉంది. ఈ దేశంలో కూడా బిలీనియర్ల సంఖ్య 2027 నాటికి 884కు పెరగబోతుందని భావిస్తోంది. దీని తర్వాత 697 మందితో చైనా, 357 మందితో భారత్‌ రెండు, మూడో స్థానంలో ఉంటాయని రివ్యూ పేర్కొంది. 1 బిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవారిని బిలీనియర్లుగా గుర్తిస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2,252 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2027 నాటికి 3,444కు పెరగనుంది. మొత్తం సంపద పరంగా ప్రపంచంలో భారత్‌ ఆరో సంపన్న దేశంగా ఉంది. భారత సంపద 8,230 బిలియన్‌ డాలర్లు. పెద్ద మొత్తంలో వ్యాపారవేత్తలు, మంచి విద్యావ్యవస్థ, ఐటీలో గణనీయమైన వృద్ధి, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌, రియల్‌ ఎ‍స్టేట్‌, హెల్త్‌కేర్‌, మీడియా సెక్టార్లు భారత్‌ సంపద వృద్ధికి సహకరించనున్నాయని రిపోర్టు తెలిపింది. ప్రపంచ సంపద కూడా వచ్చే దశాబ్దంలో 50 శాతం కంటే ఎక్కువగా పెరిగనుందని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు