మిట్టల్‌ను మించిన హిందుజా

12 May, 2014 00:36 IST|Sakshi
మిట్టల్‌ను మించిన హిందుజా

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్నుల కేంద్రంగా విరాజిల్లుతున్న బ్రిటన్‌లో మన భారతీయులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు గోపిచంద్, శ్రీచంద్‌లు బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. వీరి సంపద 11.9 బిలియన్ పౌండ్లు. అంటే రూ.1,20,190 కోట్లు. వచ్చే వారం విడుదల కానున్న సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ముందస్తు గణాంకాల ప్రకారం.. రష్యా వ్యాపారవేత్త అలిషర్ ఉస్మనోవ్ 10.65 బిలియన్ పౌండ్లతో (రూ.1,07,565 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.

గతేడాది ఆయన తొలి స్థానంలో ఉన్నారు. ఇక కోల్‌కతాలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 10.25 బిలియన్ పౌండ్లతో (రూ.1,03,525 కోట్లు) 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వాహన, రియల్ ఎస్టేట్, చమురు తదితర రంగాల్లో హిందుజా గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 ఇంకా ఉన్నారు..
 బ్రిటన్ సంపన్నుల్లో మరింత మంది భారత సంతతివారు తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. లక్ష్మీ మిట్టల్ సమీప బంధువు వస్త్ర, ప్లాస్టిక్ రంగంలో ఉన్న ప్రకాశ్ లోహియా 46వ ర్యాంకు దక్కించుకున్నారు. స్టీలు కంపెనీ కపారో అధినేత లార్డ్ స్వరాజ్‌పాల్ 48వ స్థానంలో నిలిచారు. మెటల్, మైనింగ్ రంగంలో ఉన్న వేదాంతా రిసోర్సెస్ చీఫ్ అనిల్ అగర్వాల్ 50వ ర్యాంకు దక్కించుకున్నారు. ఇండస్ గ్యాస్ ఫౌండర్ అజయ్ కల్సి 102వ స్థానంలో నిలిచారు. చమురు, సహజ వాయువు, పాదరక్షలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పలు కంపెనీలను అజయ్ నిర్వహిస్తున్నారు. సూపర్ రిచ్ టాప్-100 జాబితాలో చోటు సంపాదించాలంటే నికర విలువ 1 బిలియన్ పౌండ్లు (రూ.10,100 కోట్లు) దాటాలి. ఇక టాప్ 50 జాబితాకైతే సంపద 1.7 బిలియన్ పౌండ్లు (రూ.17,170 కోట్లు) ఉండాల్సిందే. 10 ఏళ్ల క్రితం 70 కోట్ల పౌండ్లు ఉంటే టాప్ 50 జాబితాలో చోటు దక్కేది.

 సంపన్నుల నగరం లండన్..
 సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లున్న నగరంగా లండన్ నిలి చింది. బ్రిటన్ తొలిసారిగా 100కుపైగా సంపన్నులతో కిక్కిరిసిపోయింది. మొత్తం 104 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన 301 బిలియన్ పౌండ్లు దాటింది. అంటే రూ.30,40,100 కోట్లుగా ఉంది. ఇక కేవలం లండన్ నగరం నుంచే 72 మంది బిలియనీర్లు పోటీపడుతున్నారు. 48 మంది బిలియనీర్లతో మాస్కో, ఆ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలు ఉన్నాయి. కాగా, 104 మంది సంపన్నుల్లో బ్రిటన్ వెలుపల జన్మించిన వారు 44 మంది ఉండడం విశేషం. లండన్ ప్రభుత్వం గురించి సంపన్నుల జాబితా రచయిత ఫిలిప్ బెరెస్‌ఫోర్డ్ మాట్లాడుతూ పన్నుల విధానం, భద్రతా కారణంగా లండన్ ప్రపంచ ఆర్థిక కేంద్రంగా నిలిచిందన్నారు.

మరిన్ని వార్తలు